ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల కొరత ఎంతగా ఉందో అంతకు మించి ఆహార పదార్థాల వృధా ఉందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్ తెలిపింది. 2024 ఆహార వ్యర్థాల నివేదిక ప్రకారం, అత్యధికంగా ఆహారాన్ని వృధా చేసే టాప్ 10 దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా సంవత్సరానికి 108.6 మిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది.
రెండో స్థానంలో భారత్ (78.1 మిలియన్ టన్నులు), ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్ (30.7 మిలియన్ టన్నులు), నైజీరియా (24.7 మిలియన్ టన్నులు), అమెరికా (24.7 మిలియన్ టన్నులు) ఉన్నాయి. బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మెక్సికో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఆహార వ్యర్థాలను తగ్గించడం స్వయం అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆహార వ్యర్థాల పరిధిని తగ్గించడం చాలా అవసరమని తెలిపింది. ఈ సర్వే వల్ల ఆహార వ్యర్థాల సమస్య ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చని వెల్లడించింది.
ఆహార వ్యర్థాల ఇండెక్స్ 2021 ప్రకారం.. రిటైల్(ఫుడ్ బిజినెస్), ఇళ్లలో ఆహార వ్యర్థాలను తగ్గించే అవసరాన్ని గుర్తించాలని కోరింది. రిటైల్ ఆహార వ్యర్థాల కంటే ఇళ్లలో ఆహార వ్యర్థాలు ఎక్కువగా ఉన్నాయని యూఎన్ సర్వేలో తేలింది.
యూరోపియన్ యూనియన్ లో, ప్రతి సంవత్సరం 59 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా వేసింది. ఇందులో దాదాపు 54% ఇళ్లలో ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ప్రతి యూరోపియన్ ఏడాదికి దాదాపు 132 కిలోల ఆహార వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ మొత్తంలో 72 కిలోల వ్యర్థాలు ఇంట్లోనే వృధా అవుతాయి.
ఆహార వ్యర్థాల సూచిక 2024 నివేదికను మూడు కీలక మార్గాల్లో సర్వే చేసి రూపొదించారు. ఆహార వ్యర్థాలపై విస్తృతమైన డేటా అవసరమని యూఎస్ పర్యావరణ ప్రోగ్రామ్ అభిప్రాయపడింది. దీంతో నివారణ మార్గాలపై పటిష్టమైన చర్యలు ప్రారంభమవుతాయి. రిటైల్ ఆహార వ్యాపారం, ఇళ్లలో ఆహార వ్యర్థాలపై నిర్థిష్టమైన లెక్కలు అవసరం.
Also Read: Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?
ముందుగా ఆహార వ్యర్థాల లెక్కలపై దృష్టి పెడితే ఆహార వ్యర్థాల తగ్గింపునకు పరిష్కారాలను అన్వేషించడం సులభం అవుతుందని యూఎస్ పర్యావరణ ప్రోగ్రామ్ భావిస్తోంది. 2024 నివేదికలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలపై దృష్టి సారించి, ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాలను తగ్గించడానికి ప్రభావవంతమైన విధానాలను అమలు చేయాలని కోరింది.