Minister Uttam: తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సారి ఏకంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ విధానాన్ని అత్యవసరంగా సవరించాలని ఆయన కోరారు. ధాన్యం సేకరణకు కేంద్రం ప్రభుత్వం మద్ధతు ఇవ్వాలని అన్నారు. అదనపు ధాన్య సేకరణ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయబోతున్నామని తాము ఆశిస్తున్నామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయని విధంగా ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం నిలుస్తామని చెప్పారు. గత ఏడాది ఉత్పత్తి అయిన 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికార్డును ఈ సారి అధిగిమించనున్నామని అన్నారు. 80 లక్షల మెట్రిక్ వరి ధాన్యంలో 45 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు సన్న వడ్లు, 30 నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నులు ముతక ధన్యాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు.
52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకే కేంద్ర అనుమతి కోరనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన ధాన్య సేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని గోదాముల్లో, రైస్ మిల్లులలో ధాన్యం నిండిపోయి ఉందని.. ధాన్యం తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని వెల్లడించారు.
సాగునీటి వినియోగుదారుల సంఘాల ఏర్పాటుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కాలువల, చెరువుల నిర్వహణకు సంబంధించి రైతుల భాగస్వామ్యం ఉండేలా ఈ వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మొదటి చిన్న స్థాయలో అమలు చేసి.. తర్వాత పెద్ద ప్రాజెక్టు వరకు ఈ సంఘాలను విస్తరించే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామని వివరించారు.
ప్రతి వినియోగదారుల సంఘానికి నీటిపారుదల శాఖ నుంచి ఒక అధికారి కన్వీనర్‌గా నియమిస్తామని చెప్పారు. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్, సభ్యులతో చర్చలు జరిపిన తర్వాతే సంఘాల ఏర్పాటు జరుగనుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపై పైనల్ నిర్ణయం తీసుకుంటామని వివరించారు. గతంలో కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి కూడా ఇలాంటి సంఘాల ఏర్పాటు కోసం పోరాడినట్టు గుర్తు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ను నియమించి, ప్రత్యేక లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.