AP Student Murder: ఢిల్లీలో ఏపీ విద్యార్ధి దారుణ హత్య కలకలం రేపింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువకుడు దివ్వెల దీపక్ కుమార్ (24) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ఏరియాలో జరిగింది. ఎంబీఏ చదువుకుంటున్న దీపక్‌ను అతని గది సహచరుడు కాల్చినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
చదువుల కోసం ఢిల్లీకి వెళ్లిన దీపక్
దివ్వెల వెంకటరత్నం, నీరజ దంపతుల ఏకైక కుమారుడు దీపక్ కుమార్. పల్నాడు జిల్లాలో పుట్టి పెరిగిన ఆయన, ఉన్నత విద్య లక్ష్యంగా ఢిల్లీలోని ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కాలేజీలో ఎంబీఏ చేస్తున్నాడు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని కృషి చేస్తూ, కష్టపడి చదువుతున్న దీపక్ తనతో కలిసి చదువుతున్న స్నేహితుడు దేవాంశ్ (ఆగ్రా నివాసి)తో ఒకే గదిలో ఉంటున్నాడు.
సంఘటన ఎలా జరిగింది?
మంగళవారం రాత్రి హాస్టల్‌లోని గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. సెక్యూరిటీ గార్డులు వెంటనే వార్డెన్‌కు సమాచారం ఇచ్చి గదికి చేరుకునేసరికి దీపక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని తలకు బుల్లెట్ గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దేవాంశ్‌కు కూడా తలకు గాయమై స్పృహ కోల్పోయి ఉండగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు
పోలీసులు గదిని సోదా చేసి లైసెన్స్ కలిగిన రివాల్వర్, నాలుగు బుల్లెట్లు, కాల్చిన రెండు బుల్లెట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దేవాంశ్‌కు రివాల్వర్ చట్టబద్ధమైన లైసెన్స్‌తో ఉన్నట్లు తేలింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలతో గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దేవాంశ్, దీపక్‌ను కాల్చి తర్వాత తనపై తానే తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కుటుంబం దుఃఖంలో
దీపక్ మృతి వార్త వినగానే కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి దివ్వెల వెంకటరత్నం మాజీ కౌన్సిలర్. తల్లిదండ్రులు ఏకైక కుమారుడిని కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దీపక్‌కు కవల అక్కాచెల్లెళ్లు – హర్షిత, వర్షిత ఉన్నారు.
పోలీసుల తదుపరి చర్యలు
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించారు. హాస్టల్ సహచరులను, స్నేహితులను ప్రశ్నిస్తూ, గొడవకు దారితీసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాంశ్ చికిత్సలో ఉండగా, అతని ఆరోగ్యం మెరుగుపడితే అసలు వివరణ బయటపడే అవకాశం ఉంది.
విద్యార్థుల భద్రతపై ఆందోళనలు
ఈ సంఘటనతో ప్రైవేట్ హాస్టళ్లలో భద్రతా లోపాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. తుపాకీ లాంటి ఆయుధాలు విద్యార్థుల గదుల్లోకి రావడం ఎలా జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం పెద్ద నగరాలకు పంపుతున్నప్పటికీ, ఇలాంటి దారుణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: మాట్లాడలేదని రగిలిపోయిన యువకుడు.. స్కూటీపై వెళ్తున్న మహిళకు నిప్పు, ఆ తర్వాత
ఈ సంఘటన ఒకవైపు విద్యార్థుల మధ్య ఏర్పడే చిన్న గొడవలు.. ఎలాంటి పెద్ద దారుణాలకు దారితీస్తాయో చెబుతుంటే, మరోవైపు భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెడుతోంది. ఆయుధాల వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.