ఏటీఎంలో నగదు జమా చేయడానికి వెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్న రూ.93 లక్షల నగదుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బీదర్‌లో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగింది?
బీదర్‌లోని ఎస్‌బీఐ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి శివాజీ చౌక్‌లోని ఏటీఎంలో నగదును జమా చేయడానికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది బయలుదేరారు. వారు వాహనం దిగి, నగదు ఉన్న బాక్సుతో ఏటీఎంలోకి వెళ్తున్న సమయంలో బైకు మీద వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారిలో ఒకరు సెక్యూరిటీ గార్డ్. మరొకరు సాధారణ పౌరుడు. మరో సెక్యూరిటీ గార్డుకు గాయాలైనట్లు సమాచారం. పట్టపగలే ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరుపుతుంటే.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. దుండగులు తప్పించుకుని పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న సెక్యూరిటీ గార్డును హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించాడు. కొందరికి బుల్లెట్ గాయాలు కావడంతో హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
పక్కా స్కెచ్‌తో దోపిడీ..
ఈ దోపిడికి ముందు చాలా రోజుల నుంచి దుండగులు రెక్కీ నిర్వహించి ఉండవచ్చని తెలుస్తోంది. ఎస్‌బీఐ నుంచి నగదు తీసుకెళ్లడం, జమా చేసే టైమ్.. సెక్యూరిటీ గార్డు వద్ద మారణాయుధాలు ఉన్నాయా లేదా వంటి విషయాలన్నీ తెలుసుకుని ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు రూ.93 లక్షల నగదును పట్టుకుని ఉడాయించారు. పోలీసులు ప్రస్తుతం దుండగులు కోసం గాలింపులు జరుపుతున్నారు. గురువారం ఉదయం సుమారు 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు సుమారు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. రెండు టీమ్‌లుగా విడిపోయి దుండగుల కోసం గాలింపులు జరుపుతున్నారు. తెలంగాణ బోర్డర్‌కు సమీపంలోనే బీదర్ ఉంది. దీంతో దుండగులు దోపిడీ తర్వాత తెలంగాణలోకి ప్రవేశించి ఉండవచ్చే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీదర్ చుట్టు పక్క ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఘటన స్థలికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమేరాలను సైతం పరిశీలిస్తున్నారు.
In a dramatic daylight robbery, bike-borne criminals brazenly attacked and killed a security guard in #Bidar's district headquarters, escaping with Rs 93 lakh meant for an #SBI ATM.
The shocking incident occurred during a cash refill at the ATM at #ShivajiChowk, leaving one… pic.twitter.com/poQwocr84c
— Hate Detector 🔍 (@HateDetectors) January 16, 2025
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో దుండగులు కాల్పుల తర్వాత డబ్బుల పెట్టేను బైకు మీద పెట్టుకుని కూర్చొనే క్రమంలో కిందపడ్డారు. ఆ తర్వాత ఆ పెట్టెను బైకర్ హ్యాండిల్‌పై పెట్టుకుని తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, వారి వద్ద మారణాయుధాలు ఉండటంతో స్థానికులు వారిని పట్టుకొనే సాహసం చేయలేకపోయారు. కొందరు మాత్రం దూరం నుంచి వారిపై రాళ్లు విసరడం కనిపించింది. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు వాహనం వద్దే కుప్పకూలాడు. మరొకరు హాస్పిటల్‌లో మరణించినట్లు సమాచారం.
Also Read: ఇంటి తాళం పగులగొట్టి 20 తులాల బంగారం, 25 లక్షలు చోరీ.. తెలిసిన వాళ్ల పనేనా?