దేశ వ్యాప్తంగా వాహనాల వినియోగం పెరిగిపోయింది. కొంతకాలం వరకు టూ వీలర్స్ కొనుగోలు చేయగా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కారు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకు కార్ల వినియోగం పెరుగుతున్నది. పెరుగుతున్న కార్ల కారణంగా పలు సమస్యలు ఏర్పాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అడ్డుకునేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇకపై పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలని ప్రకటించింది. పార్కింగ్ ప్లేస్ ఉన్నవారికి మాత్రమే కార్లు అమ్మాలని ఆయా ఆటో మోబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
పకడ్బందీగా నిబంధనలు అమలు
పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కార్లు అమ్మాలనే నింబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. ఇకపై కార్లు కొనుగోలు చేసేటప్పుడు, కొనుగోలు దారులు పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు.
పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో పలు సమస్యలు
ముంబై సహా పలు నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం ఉండటం లేదు. తమ కార్లను రోడ్ల మీదే పార్క్ చేస్తున్నారు. దీని వల్ల జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయాణీకులు గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సి వస్తున్నది. అంతేకాదు, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజిన్లు సహా పలు అత్యవసర సేవలు అందించే వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని నివారించేందుకు కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్ కు సంబంధించి డాక్యుమెంట్స్ సమర్పించాలనే రూల్ తీసుకొచ్చినట్లు ప్రతాప సర్నాయక్ తెలిపారు.
విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు!
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా నిబంధనలకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉన్నా, వెనక్కి తగ్గబోమని తెలిపారు. మధ్య తరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదన్న ఆయన.. దానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి చర్యలు తప్పవన్నారు.
ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు
అటు ట్రాఫిక్ ను అదుపు చేయడంతో పాటు, ప్రజలు ఇతర వాహనాల మీద ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను డెవలప్ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో కేబుల్ ట్యాక్స్ వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త నిబంధనను త్వరలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవీస్ కీలక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడే ప్రైవేటు వాహనాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు మంత్రి ప్రతాప సర్నాయక్ వెల్లడించారు.
Read Also: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ ఆ సౌకర్యం!