Banjarahills Robbery Case: సంక్రాంతికి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఇప్పటికే ఏపీలో, తెలంగాణలో పలు చోట్ల వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి భారీగా నగదు, నగలు దోచుకెళ్లారు.
సంక్రాంతికి ఊరెళ్లడమే అదునుగా భావించి..
బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్ లో లవ కుమారి, వీర వెంకట రమణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఈ నెల 14న పొద్దున్నే ఉదయం అదే ఇంట్లో రెంట్ కు ఉంటున్న కరుణాకర్ అనే వ్యక్తి మోటార్ ఆన్ చేసేందుకు కిందికి వచ్చాడు. అప్పటికే వెంకట రమణ ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. తలుపు పక్కన కిటికీతో పాటు బీరువా పగులగొట్టి కనిపించాయి. ఇంట్లోని వస్తువు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించాడు.
వెంకట రమణకు ఫోన్ చేసి విషయం చెప్పిన కరుణాకర్
ఇంట్లో దొంగతనం జరిగిందని భావించిన కరుణాకర్ వెంటనే వెంకట రమణకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు బీరువాను పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇల్లు కొనేందుకు బీరువాలో దాచిన రూ. 25 లక్షలతో పాటు 20 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల్లో బంగారు హారం, గొలుసు, గాజులు, ఉంగరాలు, నెక్లెస్, పాపిడి బిళ్ల, బంగారు బిస్కెట్లు, చెవి రింగులు, లక్ష్మీ రూపులు, లక్ష్మీ రూపు విగ్రహం, వెండి పళ్లెం, పట్టీ గొలుసులు, వెండి గిన్నె ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.
Read Also: సంక్రాంతికి ఊరెళ్లిన వారే టార్గెట్, ఏపీ, తెలంగాణలో పలు ఇండ్లను ఊడ్చేసిన దొంగలు!
డోర్ పక్కన ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి
ఇళ్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, పథకం ప్రకారం తలుపు పక్కన ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టారు. అందులో నుంచి ఇంటి లోపలికి వెళ్లారు. అంటే.. ఇది బాగా తెలిసిన వారి పనే అని పోలీసులు భావిస్తున్నారు. అటు ఈ ఘటన నేపథ్యంలో చుట్టు పక్కల సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఓ మహిళ, ఓ యువకుడు సంచుల్లో ఆభరణాలు, డబ్బులు నింపుకుని వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులపు పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి.. ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!
Read Also: గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..