ASHA Worker Daughter-In-Law| సమాజంలో మహిళలు, చిన్నపిల్లల సంక్షేమం కోసం ఆశావర్కర్లు శ్రమిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు గర్భవతి అయినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వారి ఆరోగ్య సంరక్షణ చేస్తుంటారు. ప్రసవం తరువాత కూడా తల్లి బిడ్డకు టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య సలహాలు ఇస్తుంటారు. కానీ ఆశా వర్కర్ గా ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ రాక్షసంగా ప్రవర్తించింది. బలవంతంగా ఒక మహిళకు గర్భస్రావం చేయించింది. ఆ మహిళ మరెవరో కాదు స్వయాన ఆ ఆశా వర్కర్ కు కోడలు. సొంత కొడుకు భార్య. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం భదోయి జిల్లాకు చెందిన సరిత (పేర్లు మార్చబడినవి) అనే 20 ఏళ్ల యువతికి 2017లో సురేష్ (24) అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే సురేష్ తల్లి బిమలా దేవి (43) ఒక ఆశా వర్కర్ గా ఉద్యోగం చేస్తోంది. సరితకు వివాహం జరిగనప్పటి నుంచి ఇంట్లో కట్నం వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి సరిత రూ.లక్ష కట్నం తీసుకురావాలని ఆమె భర్త, అత్త ఒత్తిడి చేసేవారు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భవతి అయింది. ఆ రెండు సార్లు కూడా ఆమె ఆడపిల్లలకే జన్మనిచ్చింది. దీంతో ఆమె కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. కానీ ఆమె తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి కట్నం డబ్బులు రూ.లక్ష ఇచ్చేశారు.
Also Read: దేశంలో జోరుగా సాగుతున్న రహస్య బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్
ఆ తరువాత కొంతకాలానికి సరిత మూడోసారి గర్భవతి అయింది. అయితే ఈ సారి కూడా ఆమె మరో ఆడపిల్లకు జన్మ నివ్వబోతోందని ఆమె అత్త అనుమానం పడింది. కుటుంబానికి ఒక వారసుడు కావాలని ఆశిస్తే.. మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టోబోతోందని భావించి తన కోడలికి అబార్షన్ చేయించాలని ప్లాన్ చేసింది. దీనికోసం సరిత భర్త, అత్త, మామ సహా మరో ముగ్గురు బంధువులు కలిసి ఆమెకు అబార్షన్ చేశారు. కానీ అబార్షన్ చేశాక సరిత ఆరోగ్యం క్షీణించింది. సరిత ఇక చనిపోతుందేమోనని భయపడి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరిత ఈసారి భయపడకుండా తన అత్త, భర్త కలిసి బలవంతంగా అబార్షన్ చేసారని.. తనను ఇన్నేళ్లుగా కట్నం కోసం వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కానీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ తరువాత కూడా సరిత తన అత్తారింటికే వెళ్లింది.. కానీ మార్చి 2024న ఆమెను ఇంటి నుంచి అత్త, భర్త గెంటేశారు. దీంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేకపోవటంతో కోర్టులో ఏప్రిల్ 13, 2024న కేసు వేసింది. ఆమె కేసు విచారణ చేసిన కోర్టు డిసెంబర్ 17న పోలీసులు కేసు నమోదు చేసి సరిత అత్త, భర్త, మరో నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు సరిత అత్త, భర్త, మరో నలుగురిపై కట్నం వేధింపులు, గృహ హింస చట్టాల కింద కేసు నమోదు చేశామని.. విచారణ నిమిత్తం నిందితులను అదుపులోకి తీసుకున్నామని భదోయి పోలీసులు తెలిపారు.