Kcr Next Plan: ఫార్ములా ఈ రేస్ కేసు తర్వాత బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? న్యాయస్థానం ఆదేశాలతో తొలుత హ్యాపీగా ఫీలైన పెద్దాయన కేసీఆర్, ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? కోరికే దుఖాలకు మూలమని ఆయనకు అర్థమైందా? పార్టీ కారును ఫార్ములా ఈ వాహనం గట్టిగా ఢీ కొట్టిందా? నెక్ట్స్ ఏం జరుగుతోంది? అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయా? అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.
పార్టీ వర్గాలు, బీఆర్ఎస్ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అధికారం కోల్పోయిన తర్వాత కారు పార్టీ భారీ కుదుపులకు లోనయ్యింది. తొలి ఏడాది ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్లడంతో డీలా పడిపోయారు కేసీఆర్. రెండో ఏడాది హ్యాపీగా గడుస్తుందని భావించినప్పటికీ, ఇప్పుడు కొడుకు కేటీఆర్ వంతైంది.
ఫార్ములా ఈ -రేసు వ్యవహారంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రెండు రోజులకే, ఈడీ కేసు నమోదు చేయడంతో షాకయ్యారట. శుక్రవారం వరుసగా జరిగిన పరిణామాలతో పెద్దాయన కలత చెందారట. వరుస కేసుల వ్యవహారంతో ఇంటి గుట్టు రోడ్డుపైకి వచ్చింది. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామా అని లోలోపల మధన పడుతున్నారని సమాచారం.
గతంలో రేవంత్‌ను అరెస్ట్ చేసి తప్పు చేశామని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల మాట. రాజకీయాల్లో ఉంటామని, కానీ అధికారం అన్నది కొద్దిరోజులు మాత్రమే ఉంటుందని ఆలస్యంగా గుర్తించారట. దాని కోసం పరువు పోవడం ఎంతవరకు కరెక్టని తనను కలిసివారి దగ్గర అన్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ఈడీ దిగడంతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి.. రేపో మాపో మళ్లీ కోర్టుకు
లిక్కర్ కేసులో కవిత అరెస్టయినప్పుడు కేసీఆర్ నోరు విప్పలేదు. కేటీఆర్‌పై కేసులు నమోదు అయినప్పుడు సైతం నోరు ఎత్తుకుండా మౌనం ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ ఆలోచన ఏంటి? మళ్లీ యాక్టివ్ అవుతారా? సైలెంట్‌గా ఉండడం బెటరని భావిస్తున్నారా ? ఇదే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది.
కేటీఆర్‌పై కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో కొందరు పోల్స్ పెట్టారు. కారు పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరు అన్నదానిపై కవిత కంటే హరీష్‌రావు ఎక్కువ మంది మద్దతు పలికారు. హరీష్‌రావు 44 శాతం రాగా, కవిత వైపు 33 శాతం మంది మొగ్గు చూపారు. ఈ వ్యవహారం కూడా కేసీఆర్ చెవిలో పడిందని సమాచారం. దీంతో కక్కలేక మింగలేక సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
ఫస్ట్ ఇయర్ మాదిరిగా ఈ ఏడాది కూడా సైలెంట్‌గా ఉంటారా? మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతలు, అభిమానులను వెంటాడుతున్నాయి. ఇప్పుడున్న స్థితినే కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. కేటీఆర్ అరెస్టయి జైలుకి వెళ్తే బయటకు తీసుకురావడం ఏంటనే దానిపై ఆ పార్టీ నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు.
కేటీఆర్ తన లీగల్ టీమ్ ద్వారా నడిపిస్తారని అంటున్నారు. వారానికి ములాఖత్‌లు ఉంటాయని, అప్పుడు న్యాయవాదులతో భేటీ అయి సలహాలు, సూచనలతో అడుగు ముందుకేసే అవకాశముందని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సెంకడ్ ఇయర్ కారు పార్టీలో కుదుపులు భారీగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి నేతలు వలస పోతే పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న.