రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మహమ్మద్ ఖదీర్ అనే వ్యక్తిని దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. సులేమాన్ నగర్‌లోని తన సొంత కార్యాలయంలోనే ఈ దారుణం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మహమ్మద్ ఖదీర్ ఎప్పటిలాగే తన ఆఫీసులో పనుల్లో నిమగ్నమై ఉండగా.. హఠాత్తుగా లోపలికి ప్రవేశించిన దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. ఖదీర్‌ను లక్ష్యంగా చేసుకుని శరీరంలోని పలు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దాడి చేసిన అనంతరం నిందితులు అక్కడ నుండి చాకచక్యంగా పరారయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరించింది. ఈ హత్య వెనుక కుటుంబ విభేదాలే ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఖదీర్ బామ్మర్దులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి వివాదాలు లేదా కుటుంబ అంతర్గత గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టపగలే, అది కూడా తన సొంత ఆఫీసులోనే ఒక న్యాయవాది హత్యకు గురికావడం న్యాయవాద వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Dog Adoption: కేబీఆర్ పార్క్‌లో సందడిగా ‘డాగ్ అడాప్షన్ డ్రైవ్’.. 130 కుక్కలను దత్తత తీసుకున్న ఎంపీ!