Bangalore Cyber Scam: మీరు ఇప్పటి వరకు గృహాలు, కార్లు, బస్సులు, ఇలా బాడుగకు, అద్దెకు తీసుకోవడం చూసి ఉంటారు. కానీ ఇలాంటిది మాత్రం వినే ఉండరు. అదేనండీ బ్యాంక్ అకౌంట్ కూడా అద్దెకు ఇస్తున్నారట. చివరికి పోలీసుల నోటీసులు వస్తే గానీ తెలియడం లేదట అసలు మోసం. ఔను అకౌంట్ లు కూడా బాడుగకు తీసుకుంటాం.. మీ అమౌంట్ మీకిస్తామంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారట. ఇంతకు ఆ మోసం ఏమిటి? మనం ఎలా భాద్యులం అవుతామో తెలుసుకుందాం.
సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మన అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు వరం. అందుకే మనం సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుండి మరో లెక్క అనే తరహాలో సైబర్ నేరాలు సాగుతున్నాయి. అందుకే పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు సిద్దమవుతున్నారు. అలాగే ప్రజలను కూడా చైతన్యవంతులను చేస్తున్నారు.
తాజాగా ఒక కొత్త తరహా సైబర్ మోసం బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. ముందుగా అమాయకులైన ప్రజలు, విద్యార్థులను సంప్రదిస్తారు సైబర్ నేరగాళ్లు. మీ పేరున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, మాకు ఆ ఫోన్ నెంబర్, అకౌంట్ వివరాలిస్తే చాలు, మీ కమీషన్ మీకిస్తామంటూ వారు హామీ ఇస్తారు. ఇంకేముంది మనకు నెలనెలా కమిషన్ వస్తుంది కదా అంటూ.. ప్రధానంగా విద్యార్థులు తమ ఖాతాల వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. దీనితో సైబర్ నేరగాళ్లు.. మన వద్ద తీసుకున్న అకౌంట్ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారట.
Also Read: Coconut Oil in Winter: చలికాలంలో రాత్రిపూట కొబ్బరి నూనెను ఇలా వాడితే.. జరిగేది ఇదే
సైబర్ మోసంపై ఎవరైనా ఫిర్యాదు ఇచ్చిన సమయంలో మన వివరాల ఆధారంగా, పోలీసుల నోటీసులు వస్తున్నాయట. అంటే సైబర్ మోసానికి పాల్పడ్డ నేరగాడు తప్పించుకొని, మనం ఆ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న మాట. ఇటీవల బెంగుళూరు పోలీసులు ఇలాంటి కేసును ఛేదించారు. కానీ ఇక్కడ అకౌంట్ బాడుగకు ఇచ్చిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అందుకే ఇలా అకౌంట్స్ బాడుగకు ఇచ్చారో, మీరు కటకటాల పాలు కావాల్సిందే. మీ ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోవద్దు. అలాగే డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దు. తస్మాత్ జాగ్రత్త సుమా!