చలికాలంలో కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ నూనె. ఎవరికైనా అందుబాటు ధరలోనే ఇది దొరుకుతుంది. అందుకే దీన్ని వాడడం కూడా చాలా సులువు. అమ్మమ్మల కాలం నుండి కూడా కొబ్బరి నూనెను వాడేవారు ఎంతోమంది. ఇప్పటికీ కూడా కొబ్బరి నూనెనే జుట్టు కోసం, చర్మం కోసం వినియోగిస్తూ ఉంటారు.
కొబ్బరిలో అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే గుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి మనకు ఇచ్చిన అందమైన బహుమతుల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన చర్మానికి మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మానికి, శరీరానికి, జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంలోని తేమదనాన్ని బయటకు పోకుండా లాక్ చేస్తుంది. తద్వారా చలికాలంలో చర్మాన్ని కాపాడుతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే చలికాలంలో ప్రతి రాత్రి కొంత కొబ్బరి నూనెను శరీరానికి అప్లై చేసుకోండి. ఉదయం కల్లా మీ చర్మం మృదువుగా మారిపోతుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ మాయిశ్చరైజర్లలో కొబ్బరి నూనె కూడా ఒకటి. ఇది త్వరగా చర్మంలోకి ఇంకిపోతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గిస్తుంది. దద్దుర్లు వంటివి కూడా రాకుండా అడ్డుకుంటుంది. రాత్రి పడుకోబోయే ముందు పెదాలకు కాస్త కొబ్బరి నూనె రాసి నిద్రపోండి. ఉదయం కల్లా మీ పెదవులు తేమవంతంగా, మృదువుగా మారిపోతాయి. పొడి చర్మానికి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్‌గా కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది.
మీకు పొడి లేదా సాధారణ చర్మం ఉంటే రాత్రిపూట కొబ్బరి నూనెను ముఖానికి కూడా అప్లై చేసుకుని నిద్రపోండి. ఇది పొడి చర్మం వల్ల వచ్చే దురద రాకుండా అడ్డుకుంటుంది. చర్మం మృదువుగా, తేమవంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే పోషకాహార లోపం చర్మంలో కనిపించకుండా అడ్డుకుంటుంది. అయితే జిడ్డు చర్మం కలవారు మాత్రం కొబ్బరి నూనె ముఖానికి రాసుకోకూడదు. ఇది మరింత జిడ్డుగా ఉంటుంది. కాబట్టి మీ చర్మం మూసుకుపోయేలా చేస్తుంది. మొటిమల సమస్యను పెంచేస్తుంది.
కొబ్బరి నూనెలో కొంచెం గ్లిజరిన్ వేసి చర్మానికి రాసుకుంటే పొడి చర్మం మీకు మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. కొబ్బరి నూనె, గ్లిజరిన్… ఈ రెండూ కూడా చర్మాన్ని తేమవంతంగా ఉండేలా చూస్తాయి. కాబట్టి పొడి చర్మం ఉన్నవారు కొబ్బరి నూనెలో గ్లిజరిన్ ఒక చుక్క వేసుకొని ముఖానికి రాసుకుంటే ఎంతో ఉత్తమం. అలాగే దాన్ని జుట్టుకు కూడా అప్లై చేయవచ్చు.
కొబ్బరి నూనెలో కలబంద జెల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ రెండూ కూడా చర్మానికి మాయిశ్చరైజర్లాగా చేస్తాయి. అలోవెరా జెల్‌లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారిపోతుంది. కొబ్బరినూనె, కలబంద రెండూ కలిసి పొడి చర్మానికి మంచి మెరుపులు అందిస్తాయి.