BRS Leader Attack: నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త, బీఆర్ఎస్ నేత దండు శేఖర్ పై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. నాగారం 80 క్వార్టర్ దగ్గర శేఖర్ ఉండగా ఆటోలో వచ్చిన నింధితుడు మొదట కిందపడేసి ఆ తరవాత ఆటోలోని రాడ్డు తీసుకువచ్చి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నింధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నింధితుడు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. తన 100 గజాల ఫ్లాట్ ను శేఖర్, అతని అనుచరులు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. శేఖర్ అనుచరుడు గోపాల్ గ్యాంగ్ ను మెయిన్ టైన్ చేస్తాడని చెప్పాడు. గోపాల్ కబ్జాకు పాల్పడితే శేఖర్ వచ్చి అక్కడ కూర్చుంటాడని అన్నారు. ఖబ్జా చేసిన తరవాత తనను శేఖర్ వద్దకు వెళ్లాలని చెప్పారని, ఆయన వద్దకు వెళ్లి ఎంతో ప్రాధేయపడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తన భూమిని వదిలిపెట్టాలని బతిమాలినట్టు తెలిపాడు. అయినప్పటికీ తనపైనే జోకులు వేస్తూ విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పాడు. అంత డబ్బులు తాను ఇవ్వలేనని అందుకే అరాచకాలు చూడలేక దాడి చేశానని తెలిపాడు. మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ నేత తనను వేధిస్తున్నాడని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.