Illegal Smuggling: స్వేచ్ఛ బ్యూరో: అప్పుల్లో మునిగిపోయిన కుటుంబం.. చదువుతున్నది రాష్ట్రం కాని రాష్ట్రంలో బీటెక్. చదువుకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవటానికి ఆ విద్యార్థి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను తరచూ హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతూ చివరకు కటకటాల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఎం.చరణ్ (22) చంఢీఘడ్ లో బీటెక్ చదువుతున్నాడు. కాగా, ఇటీవల అతని కుటుంబం అప్పల్లో కూరుకుపోయింది. దాంతో చదువుకు అవసరమైన డబ్బు లేక చరణ్ ఇబ్బందులు పడుతున్నాడు.
ఆ సమయంలో కొందరు స్నేహితులు ఇచ్చిన సలహాతో చంఢీఘడ్ నుంచి ఖరీదైన నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని కొని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మటం మొదలు పెట్టాడు. నెలలో రెండుసార్లు ఇలా వస్తూ ఇప్పటివరకు 17కి పైగా మద్యం బాటిళ్లను తెలిసిన వారికి విక్రయించాడు. ఈ మేరకు సమాచారం అందటంతో సికింద్రాబాద్ ఎక్సయిజ్ డీటీఎఫ్ సీఐ సౌజన్య అతని కదలికలపై కన్నేసి పెట్టారు. మంగళవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఖరీదైన షివాస్ రీగల్, జానీవాకర్ బాటిళ్లు అమ్ముతుండగా దాడి చేసి పట్టుకున్నారు. నిందితుని నుంచి 15బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసులు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నారాయణగూడ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: సత్యారెడ్డికి ఘన సన్మానం..హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కింగ్ బుద్ధ’ పై క్రేజీ అప్‌డేట్
ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెప్పించుకుంటూ హైదరాబాద్ లో అమ్ముతున్న నలుగురిని ఎక్సయిజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు లక్షల రూపాయల విలువ చేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేటకు చెందిన కోనేరు వెంకటేశ్, తలగిరిల సాయి గణేశ్, శివం, అరవింద్ సింగ్ స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించటానికి గంజాయి దందా చేయాలని నలువురు కలిసి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లిలో ఓ రూంను అద్దెకు తీసుకున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయి తెప్పిస్తూ ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తున్నారు. ఆ తరువాత నలుగురు నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వాటిని అమ్ముతున్నారు. కాగా, మంగళవారం తెల్లవారుఝామున నలుగురు కలిసి ఆల్విన్ కాలనీలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ టీం సీఐ బాలరాజు సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి కూకట్ పల్లి ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద సోనల్ కుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా ఎక్సయిజ్ ఎస్టీఎఫ్ డీ టీం ఎస్ఐ జ్యోతికి సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లిన ఆమె నిందితుడైన సోనల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి కొండాపూర్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: భువనగిరిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ..!