Gujarat Shocker : బడిలో ఉన్నప్పుడు స్నేహితులతో ఆటలు, పాటలు జీవితాంతం గుర్తుంచుకుంటాం. తెలిసీ తెలియని వయస్సులో ఛాలెంజ్ లు సైతం చేసుకుంటుంటారు విద్యార్థులు. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే, మరికొన్ని భయంకరంగా ఉంటుంటాయి. అలాంటి ఘటనే ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. గుజరాత్ లోని మోటా ముంజియాసర్ ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థి విసిరిన ఛాలెంజ్ తో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన తెలిసి.. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కంగారు పడిపోయారు.
మోటా ముంజియాసర్ స్కూల్ లో ఒక సహ విద్యార్థి డబ్బు కోసం చేతులపై బ్లేడ్ తో కత్తిరించుకోవాలని ఛాలెంజ్ విసిరాడు. దాంతో.. ఒకరిని చూసి మరొకరు.. దాదాపు 40 మంది విద్యార్థులు చేతులు కత్తిరించుకోవడంతో.. వారంతా గాయాల పాలయ్యారు. చిన్న వయస్సులో ఆ విద్యార్థికి అలాంటి క్రూరమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా.. ఓ వీడియో గేమ్ చూసి అతను ప్రేరణ పొందినట్లుగా చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఘటన తర్వాత ఫోన్లు, వీడియో గేమ్స్ చిన్నారుల పట్ల ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తోందోనని తల్లిదండ్రులు, పాఠశాల అధికారులలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దారితీసింది.
కొన్ని స్థానిక పత్రికలు, మీడియా సంస్థలు వెల్లడించిన అంశం ప్రకారం.. బగసారకు చెందిన ఏడో తరగతి విద్యార్థి తన క్లాస్‌మేట్స్‌కు పెన్సిల్ షార్పనర్ బ్లేడుతో చేతులు కోసుకోవాలని ఛాలెంజ్ విసిరాడు. అలా చేస్తే రూ.10 ఇస్తానని చెప్పాడు. ఛాలెంజ్ చేసి గెలిచిన వాళ్లకు అతను డబ్బులు ఇస్తుంటే.. నిరాకరించిన వారు తనకు రూ.5 బాకీ పడ్డారని చెప్పడం ద్వారా మరింత మందిని ఛాలెంజ్ చేసేలా ప్రేరేపించాడు. మరికొంత మంది విద్యార్థులు.. డబ్బుల కోసం తమని తాము గాయపరుచుకునేందుకు సిద్ధపడ్డారు.
ఒకే బడిలో ఎక్కువ మంది పిల్లలు గాయపడడంతో పిల్లలు, గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్లారు. వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బడిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల తిరిగి తెరిచిన తర్వాత దర్యాప్తు ప్రారంభమవుతుందని బగసర పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ తెలపగా.. మోటా ముంజియాసర్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ మక్వానా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలు వీడియో గేమ్‌ను అనుకరిస్తూ ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. పాఠశాలకు సమాచారం అందిన తర్వాత, ఆందోళనలను పరిష్కరించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ సంఘటన జరగడానికి కారణమైన నిర్లక్ష్యానికి కారణమైన వారిపై పోలీసు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అభ్యర్థించారు.
బ్లూ వేల్ ఛాలెంజ్
2017లో ఆటగాళ్లలో స్వీయ హాని, ఆత్మహత్యల కేసుల అధికంగా నమోదైన తర్వాత ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించి, అపఖ్యాతి పాలైన వీడియో గేమ్స్ లో బ్లూ వేల్ ఛాలెంజ్ ఒకటి. ఇప్పుడు పిల్లలు గాయపడిన ఘటన కూడా ఇలాంటి ఆన్‌లైన్ ఛాలెంజ్‌తో ముడిపడి ఉండవచ్చని కొంతమంది స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, అధికారులు ఇంకా అలాంటి సంబంధాన్ని నిర్ధారణకు రాలేదు. అమ్రేలి జిల్లా విద్యాశాఖ అధికారి కిషోర్‌భాయ్ మాయాని మాట్లాడుతూ, విద్యా శాఖ ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. గాయాలు ఎలా సంభవించాయో, సరైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులను ప్రశ్నించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు.