Chicken Shop Murder| క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, జరిగే ఘర్షణలు హింసాత్మకంగా మారుతాయి. తాజాగా అలాంటి ఒక ఘటన మహారాష్ట్ర జరిగింది. ఒక చికెన్ షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు షాపు యజమానితో గొడవపడ్డారు. వాగ్వాదం పెరిగి ఆ షాపు ఓనర్ ఆ ముగ్గురిపై దాడి చేశాడు. చికెన్ కత్తితో పరుగులు తీయించి నరికాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గొడవ ఏంటి?
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో గురువారం రాత్రి ఒక దారుణ ఘటన జరిగింది. చికెన్ షాపు దగ్గర మూత్ర విసర్జన చేసిన విషయంపై జరిగిన గొడవలో 35 ఏళ్ల వ్యక్తిని చికెన్ కోసే కత్తితో హత్య చేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు షాపు యజమానితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
మృతుడు నీతిన్ సన్‌క్‌పాల్ (35), ముకుంద్‌వాడీలోని రాజ్‌నగర్‌కు చెందినవాడు. అరెస్టయిన వారిలో మస్తాన్ అలియాస్ నన్నా ఖురేషి (29), సమీర్ ఖాన్ (19), బాబర్ షేక్ (32), సాజిద్ అలియాస్ సజ్జు (29), నసీర్ ఖాన్ (20) ఉన్నారు. వీరంతా ముకుంద్‌వాడీలోని ఖురేషి చికెన్ షాప్‌కు చెందినవారు.
ఘటన ఎలా జరిగింది?
నీతిన్ తన సోదరుడు, స్నేహితుడితో కలిసి స్థానిక హోటల్‌లో భోజనం చేశాడు. ఆ తర్వాత అతను చికెన్ షాపు వెనుక మూత్ర విసర్జన చేయడానికి వెళ్లాడు. దీనికి ఖురేషి అభ్యంతరం చెప్పాడు. ఈ విషయంపై వాదన తీవ్రమైంది. నితిన్, అతని సోదరుడు, స్నేహితుడు.. ఈ ముగ్గురూ కలిసి ఖురేషితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో వారి రెచ్చగొట్టే మాటలు విన్న ఖురేషి కోపంతో మాంసం కోసే కత్తిని తీసుకొని ముగ్గురిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నీతిన్ అక్కడే మరణించాడు, మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు.
పోలీసులు ఈ కేసులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచార నిరోధక) చట్టం కింద, అలాగే హత్య, హత్యాయత్నం, అల్లర్లకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లను వర్తింపజేశారు. నిందితులను శుక్రవారం ప్రత్యేక (SC/ST చట్టం) కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితులకు బెయిల్ మంజూరు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ స్వామి తెలిపారు. పోలీసులు ఈ కేసును లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితులు బెయిల్‌పై విడుదలైనప్పటికీ, విచారణ కొనసాగుతోందని చెప్పారు.
Also Read: భయం లేకుండా పార్టీ ఎంజాయ్ చేయండి.. ఈ టిప్స్ పాటిస్తే నో హ్యాంగోవర్
యాంటీ-ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్
ఈ హత్య ఘటనను గమనించిన స్థానిక అధికారులు.. ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్ లపై నిర్మాణమున్న 229 దుకాణాలు, టిన్ షెడ్‌లు, గ్యారేజీలు, వాషింగ్ సెంటర్లు, శాశ్వత నిర్మాణాలను కూల్చివేశారు. ఆక్రమణ నిరోధక డ్రైవ్ ద్వారా అధికారులు ప్రాంతంలో క్రమశిక్షణను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.