CP Sudheer Babu PC: ఇతర రాష్ర్టాల నుంచి పసిపిల్లలను కొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో కీలక నిందితురాలు అయిన ఆశా వర్కర్ సహా 9 మంది ఉన్నారు. వీరి నుంచి 10 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పిల్లల అమ్మకాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
చిన్నపిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
రాచకొండ పోలీసులు చిన్న పిల్లల విక్రయాలకు సంబంధించిన గత కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ తరుణ్ జోషి కమిషనర్ గా ఉన్న సమయం నుంచి ఓ స్పెషల్ టీమ్ చిన్న పిల్లల విక్రయాలపై ప్రత్యేక నిఘాను కొనసాగిస్తోంది. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలను కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్ముతున్న9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ ముఠా నుంచి 10 మంది పిల్లలను రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో ఆరుగులు బాలికలు కాగా, నలుగురు బాలురు ఉన్నారు. చిన్న పిల్లలను దత్తత తీసుకున్న 18 మంది తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాను లీడ్ చేసేది అమూల్యగా పోలీసులు గుర్తించారు. ఈమె ప్రస్తుతం ఆజంపురా UPHCలో ఆశా వర్కర్ గా పని చేస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర, యూపీ, చత్తీస్ గఢ్ నుంచి పిల్లల కొనుగోలు
ఈ ముఠా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, చతీస్ గఢ్ రాష్ట్రాల నుంచి పిల్లలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ ధరలకు పిల్లలను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 18 మంది చిన్నారులను అమ్మినట్లు పోలీసులు తెలిపారు. కీలక నిందితురాలు అమూల్య 10 మంది చిన్నారులను అమ్మినట్లు వెల్లడించారు. శిశువులను రూ. 4,00,000 – రూ. 5,00,000 లక్షల మధ్య కొనుగోలు చేసి రూ. 5,00,000 – రూ.6 ,00,000 లక్షల మధ్య అమ్మేవాళ్లు. ఆడ శిశువులను రూ. రూ. 2,00,000 – రూ. 3,00,000 లక్షల మధ్య కొనుగోలు చేసి రూ. 4,00,000 – రూ.5,00,000 లక్షల మధ్య అమ్ముతున్నారని పోలీసులు వెల్లడించారు.
25 మంది శిశువుల అమ్మకాలు
ఇప్పటి వరకు 25మంది శిశువు అమ్మకాలు జరిగినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. వారిలో 16 మందిని రెస్క్యూ చేయగా, మిగతా 9 మందిని కాపాడనున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులు దత్తత చేయిస్తున్నట్లు చెప్తున్నప్పటీ లీగల్ చేయడం లేదన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం దత్తత ప్రక్రియ అన్ లైన్ లో నమోదు చేసిన తర్వాత ప్రభుత్వం అనుమతి తోనే జరగాలని సీపీ తెలిపారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన, చిన్నారుల అక్రమ విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also:దొంగనే దోచుకున్న దొంగ.. ఓర్నీ, వీడెవడో మహా కంత్రీలా ఉన్నాడే!