Man Cheats Fraudster| ఇటీవల చాలామందికి నకిలీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. “మీ పేరుతో పార్సిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి.” అని చెబుతారు. ఫోన్ చేసిన వారు తాము పోలీసులమని, సిఐడి, సిబిఐ అధికారలుమని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని చెప్పి కొత్త తరహాలో కాల్స్ చేస్తూ అమాయకులను భయపెట్టి (సైబర్ నేరగాళ్ళు) డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటిదే ఒక ఫోన్ కాల్ ఒక యువకుడికి వచ్చింది. కానీ అతను ఏమాత్రం భయపడలేదు. పైగా, ఆ మోసగాడితో ఆటలాడుకున్నాడు. మోసగాడి వద్దే రూ.10 వేలు దోచుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన భూపేంద్రసింగ్‌కు ఒక స్కామర్ ఫోన్ చేసి తాను ఒక సీబీఐ అధికారినని పరిచయం చేసుకున్నాడు. భూపేంద్రసింగ్ కు సంబంధించి అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయని.. దీంతో అతని మీద కేసు నమోదు అయిందని చెప్పాడు. దీంతో భూపేంద్ర సింగ్ తనకు ఆ వీడియోలతో ఏ సంబంధం లేదని తెలిపాడు. అయితే ఆ కేసు కొట్టేయాలంటే తనకు రూ.16 వేలు లంచం ఇవ్వాలని ఆ నకిలీ అధికారి బెదిరించాడు.
ఈ కాల్‌లో ఏదో తేడా ఉందని అనుమానించిన భూపేంద్రసింగ్, ఆ స్కామర్‌తో ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే భయపడుతూ నటించాడు. “దయచేసి ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పకండి. మీరు చెప్పితే నేను పెద్ద సమస్యలో పడిపోతాను” అంటూ భయపడినట్లు అతడిని నమ్మించాడు. చెప్పను కానీ డబ్బు ఇస్తానని ఆ నకిలీ అధికారి అడగ్గా.. భూపేంద్రసింగ్ కథలు చెప్పడం మొదలుపెట్టాడు. తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి రూ.3 వేలు కావాలని ఆ స్కామర్‌నే అడిగాడు. భూపేంద్రసింగ్ మాటలు నమ్మిన స్కామర్, మొదట రూ.3 వేలు పంపాడు. ఇక్కడే ఈ వ్యవహారం ఆగలేదు.
తాను మైనర్ కాబట్టి నగల వ్యాపారి ఆ గొలుసు తాకట్టు నుంచి ఇవ్వడం లేదని స్కామర్‌కు నమ్మించాడు. “మీరే నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలి” అని కోరాడు. మరోవైపు, భూపేంద్రసింగ్ స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఎత్తాడు. ఇక్కడ మరోసారి స్కామర్ బురిడీ కొట్టాడు. నగల వ్యాపారి మాటలు నమ్మి, స్కామర్ మరో రూ.4,480 పంపాడు. తర్వాత ప్రాసెస్ ఫీజు కింద రూ.3 వేలు ఇస్తే, ఆ గొలుసుపై రూ.1.10 లక్షలు రుణం ఇస్తానని నగల వ్యాపారి చెప్పిన మాటలు నమ్మిన స్కామర్ ఆ డబ్బు కూడా పంపాడు. ఈ విధంగా మొత్తం రూ.10 వేలు బదిలీ చేశాడు.
తానే భూపేంద్రసింగ్ ట్రాప్‌లో పడ్డానని ఆలస్యంగా గ్రహించిన స్కామర్, తన డబ్బు తిరిగి ఇవ్వమని బతిమాలుకున్నాడు. కానీ భూపేంద్రసింగ్ వెంటనే పోలీసులను సంప్రదించి, జరిగినదంతా వెల్లడించాడు. తాను తీసుకున్న రూ.10 వేలను విరాళంగా ఇస్తానని కూడా చెప్పాడు. స్కామర్ల బెదిరింపులకు భయపడకుండా, తనను తాను రక్షించుకున్నాడు మాత్రమే కాకుండా, చాతుర్యంగా వారినే దెబ్బతీసిన ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
చిన్న వాట్సాప్ మెసేజ్‌తో రూ.2 కోట్ల దోపిడీ
సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగికి ఇటీవలే తన కంపెనీ యజమాని పేరతో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో కంపెనీ నిధులను కొత్త ప్రాజెక్ట్ కోసం మరో అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఉంది. ఆ మెసేజ్ ని నమ్మిన ఆ ఉద్యోగి రూ.1.95 కోట్లు మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత కంపెనీ యజమానికి బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. అతను ఉద్యోగితో ఆ లావాదేవి గురించి ఆరతీయగా.. నిజంగానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తేలింది. అప్పుడు ఆ ఉద్యోగికి షాకింగ్ విషయం తెలిసింది. ఆ మెసేజ్ తన యజమాని ఫొటోతో ఎవరో మోసగాడు పంపించాడని అర్థమైంది.
వెంటనే కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ సెక్యూరిటీ టీం లావాదేవీని నిలిపివేసింది. దొంగను ఇంకా పట్టుకోలేకపోయినా, అతని బ్యాంక్ అకౌంట్‌ను ట్రాక్ చేస్తున్నారు. విచారణ జరుగుతోంది.