Crime News: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద శనివారం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ ఎస్‌పీఆర్ హిల్స్‌కు చెందిన దాసరి రమేష్ (45) అనే లారీ డ్రైవర్ బోండా తింటూ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు.
దాసరి రమేష్ శ్రీకృష్ణదేవరాయనగర్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లి బోండాలు తీసుకున్నాడు. తినే సమయంలో ఒక్కసారిగా బోండా గొంతులో ఇరుక్కోవడంతో అతడికి ఊపిరాడక ఇబ్బంది ఏర్పడింది. అక్కడున్న వారు వెంటనే స్పందించి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే రమేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలకి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారికి తండ్రి ప్రేమతో తినిపించిన అన్నమే ఆ బిడ్డ ప్రాణాలను బలి తీసుకుంది. పప్పు అన్నం తినిపిస్తున్న సమయంలో ఒక ముద్ద గొంతులో అడ్డుపడటంతో చిన్నారి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
క్షణాల్లోనే ఆ పాప స్పృహ కోల్పోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న బిడ్డ కేవలం అన్నం ముద్ద అడ్డుపడి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికులను సైతం కలచివేసింది.
Also Read: పవర్‌ఫుల్ బ్యాటరీ ఫోన్ కావాలా? అద్భుతమైన కెమెరా ఫోన్ కావాలా? ఏది బెస్టో ఇప్పుడు చూసేద్దాం!