Telangana Future City: ఒక్క సర్వే.. హైదరాబాద్ ప్యూచర్ ఎలా ఉండబోతోందో చెప్పేసింది. ఒక్క రిపోర్ట్.. హైదరాబాద్ ఎంత వేగంగా డెవలప్ అవుతోందో తేల్చేసింది. ఎస్.. ఇది కేంద్ర ఆర్థిక సర్వే గురించే. తెలంగాణ ఓ గ్రోత్ మోడల్ అని.. ఎకనమిక్‌సర్వే రిపోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాదు.. 2035 నాటికి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో నాలుగో స్థానానికి చేరుతుందని తెలిపింది. ఇంకొన్నేళ్లలోనే.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోతుందా?
కేంద్రం ఆర్థిక సర్వే చూశాక.. హైదరాబాద్ గ్రోత్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయ్. భాగ్యనగరం కూడా ప్రపంచ ఆర్థిక రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2035 నాటికి భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో నిలవనుంది. 8.47 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్న హైదరాబాద్ జీడీపీ.. 2035 నాటికి 201 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే ప్రకారం, గతేడాది సెప్టెంర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. దేశంలోనే అత్యధికంగా 500 కోట్ల మున్సిపల్ బాండ్లని జారీ చేసి.. అగ్రస్థానంలో నిలిచింది. 2018లో 50 బిలియన్ డాలర్లుగా ఉన్న హైదరాబాద్ జీడీపీ.. 2035 కల్లా నాలుగు రెట్లు పెరిగి 201 బిలియన్ డాలర్ల మార్క్‌ని దాటనుంది. ఈ వృద్ధితో.. హైదరాబాద్ దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా అవతరించనుంది. గ్రోత్ రేటులో హైదరాబాద్ కంటే ముందు.. సూరత్, ఆగ్రా, బెంగళూరు ఉన్నాయి. అదేవిధంగా.. ఏపీలోని విజయవాడ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి పది నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
తెలంగాణ.. కొన్నేళ్లుగా తన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. వార్షిక ప్రగతి రేటు 12.6 శాతం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ చేరిందని తెలిపింది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని.. గత ఆర్థిక సంవత్సరంలో 3.67 శాతానికి తగ్గిందని వివరించింది. 2025-26లో డిసెంబర్ నాటికి ద్రవ్యోల్బణ రేటు 0.20 మాత్రమే ఉందని ఎకనమిక్ సర్వే స్పష్టం చేసింది. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల కారణంగా తెలంగాణలో వ్యవసాయ దిగుబడి తగ్గుతోందని తెలిపింది. అయితే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందుబాటులోకి వచ్చిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల.. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు తెలిపింది. 2014లో తెలంగాణలో సాగు విస్తీర్ణం.. కోటీ 31 లక్షల ఎకరాలు ఉండగా, 2023 నాటికి 2 కోట్ల 21 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక.. ప్రభుత్వ, పైవ్రేటు రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పాదక రంగంలో దాదాపు 60 శాతం ఉపాధి కల్పిస్తున్న ఏడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. భూ భారతి పోర్టల్‌తో.. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాలను తెలంగాణ ఏకం చేసిందని తెలిపింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్ అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిందని కేంద్రం స్పష్టం చేసింది. 2019 నుంచి 2035 మధ్య అతివేగంగా పెరుగుతున్న నగరాల్లో.. సూరత్, ఆగ్రా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. అయితే.. భారత్ ఆర్థికంగా ముందడుగు వేస్తున్నా.. న్యూయార్క్, లండన్, షాంఘై, సింగపూర్ మాదిరిగా మన నగరాలు గ్లోబల్ సిటీలుగా మారడంలో వెనుకబడుతున్నాయని ఎకనమిక్ సర్వే తెలిపింది.
హైదరాబాద్ ఆర్థిక వృద్ధి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే రేవంత్ సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈ టార్గెట్ సాధించడంలో భాగ్యనగరం కీలక పాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్రం.. పారిశ్రామిక రంగంలోనూ బలమైన పునాది కలిగి ఉంది. దేశం మొత్తం తయారీ రంగ ఉపాధిలో దాదాపు 5% వాటాను తెలంగాణ కలిగి ఉంది. ఇది జాతీయ పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. తయారీ రంగంతో పాటు, సేవల రంగంలోనూ తెలంగాణ గణనీయమైన కృషి చేస్తోంది. ముఖ్యంగా.. ఐటీ, ఆర్థిక సేవలు, వృత్తిపరమన సేవల లాంటి అధిక ప్రొడక్టివిటీ కలిగిన రంగాల్లో.. తెలంగాణ ముందుంది. దేశం మొత్తంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లలో 7 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇదే..
హైదరాబాద్‌ని టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెడుతోంది.
2012లో హైదరాబాద్ వరకే పరిమితమైన అభివృద్ధి.. పదేళ్లలోనే నగర శివార్లకు విస్తరించింది. నైట్ లైట్స్ రేడియన్స్, ఆర్థిక కార్యకలాపాలు, జన సాంద్రత భారీగా పెరిగింది. పాత మున్సిపల్ సరిహద్దులను దాటి.. హైదరాబాద్ ఒక రిబ్బన్ తరహాలో చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుంటూ విస్తరిస్తోంది. ఇది మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధికి నిదర్శనమని ఆర్థిక సర్వే విశ్లేషించింది.
దేశంలో సిమెంట్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనూ తెలంగాణ కీలకమని సర్వే తెలిపింది. దేశంలోని అత్యుత్తమ 100 విద్యాసంస్థల్లో 40 శాతం సంస్థలు దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో ఉన్నాయని సర్వే వివరించింది. ఇక.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక ముఖచిత్రంలో తెలంగాణ చెరగని ముద్ర వేస్తోందని, వ్యవసాయం, సేవారంగం, మౌలిక వసతులు, మహిళా సాధికారత సహా.. అన్ని రంగాల్లో దూసుకుపోతోందని కేంద్రం ప్రశంసించింది.
హైదరాబాద్ అంటే నగరం మాత్రమే కాదు.. అంతకుమించి అని ఆర్థిక సర్వే రిపోర్ట్ చెప్పేసింది. ఇండియా గ్రోత్ ఇంజిన్‌గా హైదరాబాద్ ఎలా మారుతుందో.. ఈ రిపోర్ట్ కళ్లకు కట్టింది. 2035 నాటికి.. భాగ్యనగరం గ్లోబల్ ఎకనమిక్ పవర్‌హౌస్‌గా మారితే.. ఈ ప్రాంతం ఎలా మారనుంది? హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు.. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేంటి? రేవంత్ సర్కార్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందా?
ఒకప్పుడు చారిత్రక కట్టడాలకు, ధమ్ బిర్యానీకి కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పటంలో తనకంటూ ఓ స్పెషల్ చాప్టర్ రాసుకుంటోంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ కేవలం ఓ నగరం మాత్రమే కాదు. ఈ సిటీ.. ఇప్పుడొక గ్రోత్ మోడల్. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ టెన్ సిటీస్ లిస్టులో.. హైదరాబాద్ 4వ స్థానంలో నిలవడమనేది.. సాదాసీదా విషయం కాదు. ఐటీ నుంచి ఏఐ వరకు.. హైదరాబాద్‌ది తిరుగులేని ప్రస్థానం. ఈ సిటీ.. కేవలం సాఫ్ట్‌వేర్ ఎగుమతులకే పరిమితం కాకుండా.. ఫ్యూచర్ టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు హబ్‌గా మారుతోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటులోనూ.. బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోంది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లోనూ.. ఇప్పుడిప్పుడే గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది భాగ్యనగరం. హైదరాబాద్‌ను మరింత వేగంగా కనెక్ట్ చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కూడా ఈ వృద్ధిలో కీలకం కానున్నాయి.
హైదరాబాద్ ఇప్పుడు.. పెట్టుబడులకు స్వర్గధామం. జీసీసీలు, లైఫ్ సైన్సెస్, ఏఐ స్టార్టప్‌లు, ఏరోస్పేస్ రంగాల్లో.. ఈ నగరానికి తిరుగులేదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. దీనిని విశ్వనగరంగా మార్చేందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని.. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్‌గా పిలుస్తోంది. దీనిని.. ప్రపంచ స్థాయి సర్వీస్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక.. ఓఆర్ఆర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని.. పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్‌గా గుర్తించింది. ఇక్కడ.. తయారీ రంగాన్ని ప్రోత్సహించనుంది ప్రభుత్వం. రీజినల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతం మొత్తాన్ని.. రూరల్ అగ్రికల్చర్ రీజినల్ ఎకానమీ జోన్‌గా చెబుతోంది ప్రభుత్వం. ఇందులో.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలను బలోపేతం చేసే లక్ష్యాలను నిర్దేశించుకుంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం రెండు దశల లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సుమారు 150 నుంచి 175 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. రాబోయే పదేళ్లలో.. అంటే 2034 నాటికి దీనిని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం.. ఏటా సగటున 15 శాతం నామినల్ గ్రోత్ రేటు అవసరమనే అంచనాలున్నాయి. ఇక.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి.. తెలంగాణని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారీ లక్ష్యాల సాధనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా కీలక పాత్ర పోషిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
హైదరాబాద్ అంటే.. ఇప్పుడొక సిటీ మాత్రమే కాదు. గ్లోబల్ బ్రాండ్ కూడా. దీనిని.. మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా.. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తోంది. దీనిని.. నెట్ జీరో సిటీగా డెవలప్ చేస్తోంది. ఇది.. ఏఐ, సెమీ కండక్టర్లు, డిజిటల్ గవర్నెన్స్‌కు కేంద్రంగా మారనుంది. ఇక్కడ.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఇక.. మూజీ పునరుజ్జీవం ప్రోగ్రామ్‌లో భాగంగా.. మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ రివర్ మాదిరిగా పునరుద్ధరించి, రివర్‌ఫ్రంట్‌గా డెవలప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇక.. 354 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న జిల్లాల్లో.. కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక.. హైదరాబాద్ మెట్రో విస్తరణతో.. ఎయిర్‌పోర్ట్, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీతో పాటు ఓఆర్ఆర్ చుట్టూ అన్ని ప్రాంతాలకు మెట్రోని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్‌ని కేవలం ఐటీకి మాత్రమే పరిమితం చేయకుండా.. లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయ్.
Also Read: వనపర్తి జిల్లాలోని బీసీ గర్ల్స్ హాస్టల్ లో పుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థినులకు అస్వస్థత
కేంద్ర ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్ కేవలం దక్షిణ భారతానికే పరిమితం కాకుండా.. ప్రపంచంలోని లండన్, సింగపూర్ లాంటి మహా నగరాలతో పోటీ పడబోతోంది. 2035 నాటికి ఇదొక గ్లోబల్ సిటీగా మారడమే కాదు, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించే.. గ్రోత్ ఇంజిన్‌గా అవతరించబోతోంది. ప్రభుత్వం ముందుచూపు, మౌలిక సదుపాయాల కల్పన, పారదర్శక పాలన తోడైతే.. ప్రపంచ ఆర్థిక పటంలో.. హైదరాబాద్ అగ్రగామిగా నిలవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
Story By Anup, Bigtv