CMR Founder Passes Away: చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయన, సోమవారం ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు.
చిన్న వ్యాపారిగా మొదలుపెట్టి, ఆయన కృషి, వినూత్న వ్యాపార ధోరణుల వల్లే చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ బ్రాండ్లు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించాయి. వ్యాపార రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మోహనరావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో.. నాణ్యమైన వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది.
సీఎంఆర్ మాల్స్ వస్త్రాలు, జ్యువెలరీ వంటి పలు విభాగాల్లో విస్తృతంగా స్థాపించబడింది. సాధారణ వినియోగదారుల నుండి ప్రముఖుల వరకు అందరికీ ఇష్టమైన బ్రాండ్‌గా అవి నిలిచాయి.
చందన మోహనరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రిటైల్ రంగానికి ఆయన చేసిన సేవలు అమూల్యం. ఆయన చూపిన దారిని అనుసరించే కొత్త తరం వ్యాపారవేత్తలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి అని పలువురు పేర్కొన్నారు.
Also Read: పండుగ పూట విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత తల్లి..
మోహనరావు ప్రస్థానం ముగిసినా, ఆయన సృష్టించిన బ్రాండ్లు, విలువలు, వ్యాపార ధోరణులు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన పేరు తెలుగు రాష్ట్రాల వ్యాపార చరిత్రలో ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోనుంది.