VC Sajjanar: విధి నిర్వహణలో ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య ఘటన నిజామాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ పట్టుకునే క్రమంలో ఈ అత్యంత దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో నిందితుడు రియాజ్ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ (48) ఛాతీపై పొడవడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నంలో సబ్-ఇన్‌స్పెక్టర్ విట్టల్‌కు కూడా గాయాలయ్యాయి.
ఈ ఘటన పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి వెంటనే స్పందించి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్యను ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరగడం తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరం. ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు.
ALSO READ: CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏ ప్రకటన, ఎప్పటినుంచి అంటే?
అయితే, ఈ ఘటన సందర్భంగా చోటుచేసుకున్న సామాజిక స్పందనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నిందితుడు రోడ్డుపై కానిస్టేబుల్‌ను కత్తితో పొడుస్తున్నా, స్థానికులు ఎవరూ అడ్డుకోకపోగా.. కొందరు తమకేం పట్టనట్లుగా వ్యవహరించి, రక్తం కారుతున్న దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీయడం విచారకరం. తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించకపోవడం, సాయం అందించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ: Train Tickets: గుడ్ న్యూస్, ఇక పోస్టాఫీసులోనూ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!
ఈ విషయమై స్పందించిన వీసీ సజ్జనార్.. ‘ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయలేని సమాజంలో మనం ఉన్నామా..? అని తలచుకుంటేనే బాధేస్తోంది. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు రోడ్డుపై కత్తితో పొడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లు అడ్డుకోపోగా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం దురదృష్టకరం. విధి నిర్వహణలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్‌కి నివాళులర్పిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రమోద్ అంత్యక్రియలను పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో నిర్వహించిన విషయం తెలిసిందే..