Tirupati Crime: ఆ దంపతులకు ఏ కష్టం లేదు. ఆనందకర జీవితం సాగిస్తున్నారు. వారి సంతానం కూడ ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. కానీ ఆ దంపతులు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడ కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఆయన భార్య అరుణలు శుక్రవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వీరికి ఒక కుమారుడు, మరొక కుమార్తె సంతానం. అయితే తమతో పాటు కుమార్తె జయశ్రీ, అల్లుడు శ్రావణ్ లను వెంట తీసుకువచ్చారు. శ్రీవారిని అందరూ కలిసి దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ప్రసాదాన్ని కూడ స్వీకరించారు. ముచ్చటగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తాము తిరుమలలో అద్దెకు తీసుకున్న గది వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం కూడ చేశారు. ఆ తర్వాత కుమార్తె, అల్లుడు షాపింగ్ కోసం బయటకు వెళ్తున్నామని చెప్పి, అలా వెళ్లారు.
మళ్ళీ వారు తిరిగి వచ్చే లోగా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఆయన భార్య అరుణలు ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన దృశ్యాన్ని చూసి వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కళ్లెదుట ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులను చూసిన కుమార్తె రోదనలకు అంతు లేకుండా పోయింది. శ్రీవారి దర్శనార్థం తమను తీసుకువచ్చి, తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడడంతో కుమార్తె, అల్లుడు తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కుటుంబంకు ఎటువంటి ఆర్థిక కష్టాలు లేవని, సంతానం కూడ మంచిగా జీవితంలో నిలదొక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు, వారి కుటుంబీకుల ద్వార ఆరా తీస్తున్నారు. భార్య భర్త ఒకేసారి కన్నుమూయాలన్న కోరికతో ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఏదిఏమైనా వీరి ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణం పోలీసుల ప్రకటనతో బహిర్గతం కావాల్సి ఉంది.