Tribal Village: చెట్టు లెక్కగలవా ఓ నరహరి.. పుట్ట లెక్కగలవా.. అనే పాట వినే ఉంటారు. ఈ గ్రామంలో మాత్రం ఎప్పుడు చూసినా ఇదే పాట ప్రజల నోట వినిపిస్తోంది. అదేదో పాటపై అంత అభిమానం ఏల అని అనుకుంటున్నారా.. లేదు లేదు.. వారు రోజూ చేసే పనే అది. ఆ గ్రామస్థులు రోజుకు ఒక్కసారైనా చెట్టు ఎక్కాలి. లేకుంటే వాటర్ ట్యాంక్ ఎక్కాలి. అదీ లేదంటే కొండలైనా ఎక్కాలి. ఇలా వీరి సాహసాల వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ప్రపంచం టెక్నాలజీతో దూసుకుపోతుంది. నిరంతరం మానవుడు నూతన సాంకేతికతను కనుగొంటున్నాడు. క్రమక్రమంగా ఆ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి కూడా తీసుకొస్తున్నారు. ప్రపంచమంతా 5జీ టెక్నాలజీలో పోటీ పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం సెల్‌ఫోన్ సిగ్నల్లే రావట్లే. దేశానికి స్వాతంత్యం వచ్చి 76ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలో కరెంటు సదుపాయం లేదు. ఇలాంటి పరిస్థితి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ని నెలవంచ గ్రామంలో ఉంది. నేటికి సిగ్నల్స్ ఉండవు. అందుకే వీరు సిగ్నల్స్ కోసం రోజూ సాహసాలు చేయాల్సిందే.
ఈ రోజుల్లో ఫోన్ లేకుంటే ఒక నిమిషం కూడా ఉండలేం. ఉదయం లేచిన సమయం నుండి రాత్రి నిద్రపోయేవరకు నీడ లాగా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ మన వెంట ఉండాల్సిందే. అందులో 5జీ నెట్ వర్క్ తో సోషల్ మీడియాను వాడాల్సిందే. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడు సర్వర్ బిజీ వచ్చి ఇంటర్నెట్ స్లో అయితే చాలు మనం పడే చిరాకు అంతా ఇంతా కాదు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఆదివాసీ గిరిజన ప్రజలు సెల్ ఫోన్ వాడకం అంతంత మాత్రమే. కొంతమంది నెలకొకసారి మాత్రమే అది కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అంశాలపై తెలుసుకునేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కుతారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నేలవంచ గ్రామం. ఇది ఆదివాసి గిరిజన ప్రజలకు నిలయం. సుమారు 200 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో మౌలిక వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఎంతో ఆశలతో ఎదురుచూసిన ఈ గిరిజన ఆదివాసి ప్రజలకు నిరాశే మిగిలింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదు. ఉన్న రోడ్డు కూడా రాళ్లు తేలాయి. త్రాగునీరు లేదు. పాము కరిచిన ,తేలు కరిచిన, ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కనీసం డాక్టర్ కూడా చెప్పడానికి ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. గ్రామం ఏర్పడినప్పటి నుండి కొన్ని సంవత్సరాల వరకు వీరికి బయట సమాజంతో సంబంధాలు లేకుండా కేవలం తమ గ్రామంకు మాత్రమే పరిమితమయ్యారు. కాలక్రమేనా గ్రామం నుండి మండల కేంద్రం వరకు వివిధ సమస్యలపై, ఆహార ఉత్పత్తుల కొనుగోలుకై కాలినడకన వచ్చేవారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడ, ప్రతి చిన్న విషయానికి కాలినడకన మండల కేంద్రంకు వీరు చేరుకుంటారు.
Also Read: TPCC Protest: మోడీకి పట్టలేదు.. జైశంకర్ కు దమ్ము లేదు.. షబ్బీర్ అలీ కామెంట్స్
ఈ గిరిజన గ్రామంలో నెట్‌వర్క్ సౌకర్యం ఉండడం లేదు. దీంతో సెల్ ఫోన్లు సరిగ్గా పనిచేయడం లేదు. సిగ్నల్స్ కోసం గిరిజనులు కొండలు.. గుట్టలు ఎక్కి దిగాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నడిచి.. సిగ్నల్స్ ఉన్న చోటకు చేరుకోవాల్సి వస్తోంది. పింఛన్లు, రేషన్ సరుకులు అందుకునే సమయంలోనే కాదు.. ఆధార్ కార్డులు తదితర వాటిని పొందాలన్నా.. నానా అవస్థలు పడాల్సి వస్తోంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రామంలో సిగ్నల్ లేకపోవడం వల్ల మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. ఇది ప్రజల రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వ సేవలు, వ్యాపార సంబంధమైన కమ్యూనికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధిత టెలికాం కంపెనీలు మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.