Stolen Mobiles Recovery : హైదరాబాద్ మహానగరంలో మొబైల్ ఫోన్ చోరీలు అస్సలు ఆగట్లేదు. అయితే తాజాగా సైబరాబాద్ పోలీసులు గత 45 రోజుల్లో రూ.3.30 కోట్లు విలువ చేసే 1100 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటిని బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెంటర్ ఇక్విప్మెంట్ ఇడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఈ కొట్టేసిన ఫోన్లను రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీపీ కె. నర్సింహా మాట్లాడుతూ “మొబైల్ ఫోన్లు ప్రస్తుతం మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ నుంచి పౌరులను రక్షించడంలో సైబరాబాద్ పోలీసుల నిబద్ధతను ఈ రికవరీ డ్రైవ్ చెబుతోంది. ప్రస్తుతం మొబైల్ దొంగతనం అనేది ఒక నిరంతర సమస్యగా మిగిలిపోయింది. బ్యాంక్ ఖాతా వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లు తరచుగా దోపిడీ చేస్తారు. ఉన్నత స్థాయి విద్య ఉన్నప్పటికీ, చాలా మందికి తమకు సంబంధించి దొంగిలించబడిన డివైసెస్ దుర్వినియోగం కాకుండా ఎలా నిరోధించాలో తెలీదు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR (సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. మొత్తం7500 ఫోన్లు రికవరీ చేయగా అందులో 5500 ఫోన్లు ఈ సంవత్సరంలో చేసినవే. పౌరులు తమ పరికరాలను భద్రంగా ఉంచుకోవడం, అనుమానాస్పద ఫేక్ ఆన్‌లైన్ లింక్‌ల పట్ల జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుతున్నాము.” అని నరసింహ అన్నారు.
మొబైల్ ఫోన్ పోగానే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సిఈఐఆర్లో ఫిర్యాదు నమోదు చేయాలని, అప్పుడు తక్కువ సయమంలోనే ఫోన్‌ను రికవరీ చేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఫోన్ ట్రేస్ అవుతుందని, దీనివల్ల చాలా తొందరగా రికవరీ చేయడానికి సాధ్యమవుతుందని అన్నారు.
ఇక వీటితో పాటు సైబర్ క్రైమ్స్ పై సైతం పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. విలువైన వస్తువులు తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరు సీసీటీవీలు కూడా అమర్చుకోవాలని అన్నారు. అసాంఘిక శక్తుల గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని సూచించారు.
మీకు కొరియర్ వచ్చిందని, మాదక ద్రవ్యాలు ఉన్నట్లు వీడియో కాల్ చేసి బయపెడతారని, అటువంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. అటువంటి పరిస్తితుల్లో ఎటువంటి భయం లేకుండ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. మని కొందరు మీపై సీబీఐ కేసు అయ్యిందని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని బయపెడతారని, అలాంటి వాటి గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ఆన్ లైన్ ఫ్రాడ్ విషయంలో ప్రతిఒక్కరూ ఎంతో జాగ్రత్ర వహించాలని పేర్కొన్నారు.
ఏఏ ఏరియాల్లో ఎన్ని అంటే? – గడిచిన 45 రోజుల్లో సైబరాబాద్ పోలీసులు 1100 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో 235 మంది, బాలానగర్ సీసీఎస్‌లో 203, మేడ్చల్ సీసీఎస్‌లో 185, రాజేంద్రనగర్ సీసీఎస్‌లో 166, శంషాబాద్ సీసీఎస్‌లో 151, మేడ్చల్ జోన్‌లో 185, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ (ఎల్‌అండ్ ఓ)లో 07, మేడ్చల్ ఎల్ అండ్ ఓలో 50, బాలానగర్ ఎల్ అండ్ ఓలో 23, రాజేంద్రనగర్ ఎల్ అండ్ ఓ ద్వారా ఎనిమిది, శంషాబాద్ ఎల్ అండ్ ఓలో 12, ఐటీ సెల్ ద్వారా 60 ఫోన్లను రికవరీ చేశారు.
ALSO READ : మీ పాత ఫోన్‌ను సీసీ కెమెరాగా మార్చుకోండి, సింఫుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది!