Crime News: రోజురోజుకి మానవత్వం మంటగలుస్తోంది. డబ్బు మీద ఆశ బంధాలకు… విలువల ఇవ్వకుండా చేస్తుంది. ఇలా చాలా మంది మనీ మత్తులో పడిపోతున్నారు. కొందరైతే కన్నతల్లి, తండ్రి అనే భావన లేదు. ఆస్తి కోసం కన్నతల్లికి 3 రోజులుగా అంత్యక్రియలు చేయలేదు కన్న కూతుళ్లు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఈ అమానుష ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలంలో పోదిల నరసమ్మ అనే మహిళ, ఆమెకు కుమారులు లేకుండా ఇద్దరు కుమార్తెలే ఉన్నారు పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కలమ్మ. నరసమ్మ తన జీవితకాలంలోనే కుమార్తెలను పెంచి పెద్ద చేసి, వారి పెళ్లిళ్లు జరిపించి, ప్రతి ఒక్కరికీ సుమారు ఒక కోటి రూపాయల విలువైన ఆస్తిని పంచిపెట్టింది. ఆమె తన కుమార్తెల పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలు ఇప్పుడు ఆస్తి వివాదంలో మరుగున పడిపోయాయి.
ఇటీవల నరసమ్మ అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం తన పేరిట ఉన్న డబ్బు, బంగారాన్ని చిన్న కూతురు కలమ్మకు అప్పగించింది. చికిత్స పొందుతూ నరసమ్మ మూడు రోజుల క్రితం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని సొంత ఊరు ఆత్మకూరుకు తీసుకువచ్చారు. అయితే, అంత్యక్రియలు చేయాలంటే తల్లి పేరిట ఉన్న డబ్బు, బంగారంతోనే చేయాలని పెద్ద కూతురు వెంకటమ్మ డిమాండ్ చేసింది. దీంతో చిన్న కూతురు కలమ్మతో విభేదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా, మూడు రోజులుగా మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి అంత్యక్రియలు చేయకుండా వాయిదా వేశారు. ఆస్తి పంపకం పూర్తి కాకుండా అంత్యక్రియలు చేయమని కుమార్తెలు పట్టుబట్టారు.
వెంకటమ్మ మాట్లాడుతూ, తన చెల్లెలు కలమ్మ అంత్యక్రియలకు రావట్లేదని, ఎందుకంటే తల్లి డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని అన్నది. అయితే, తాను ఆస్తికి అంతగా అనుబంధం లేదని, తల్లి పేరిట ఉన్న ఆస్తి, డబ్బు, బంగారాన్ని గ్రామ పెద్దల సలహాతో గ్రామాభివృద్ధికి వినియోగించాలని కోరుకుంటున్నానని చెప్పింది. చెల్లెలు రాకపోయినా కొంత సమయం వేచి చూసి అంత్యక్రియలు చేస్తానని వెంకటమ్మ తెలిపింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి జీవితకాలంలో ఆస్తి తీసుకున్న కుమార్తెలు, ఇప్పుడు మరణానంతరం కూడా మానవత్వం మరచి, కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
Also Read: స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా..! మళ్లీ ఎప్పుడు..?
ఈ వివాదం మరింత తీవ్రమవుతుండగా, చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసుల చొరవతో కుమార్తెల మధ్య సంధి కుదిర్చారు, ఆస్తి పంపకం గురించి తాత్కాలిక ఒప్పందం జరిపించారు. దీంతో అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నారు. స్థానిక పోలీసు అధికారులు గ్రామ పెద్దలతో చర్చలు జరిపి, మృతదేహాన్ని గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయించారు.