Lady Don: వెండి తెర మాదిరిగా.. రియల్ లైఫ్‌లోనూ డ్యూయెల్ రోల్ చేసింది. మూడో కంటికి తెలియకుండా కొన్నాళ్లుపాటు చీకటి కార్యకలాపాలు బాగానే చక్కబెట్టింది. అనుకోకుండా పోలీసులకు చిక్కడంతో ఆమె యవ్వారం బయటపడింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున వ్యవహారాలు నడిపి చిక్కింది. ఇంతకీ ఆమె డబుల్ రోల్ ఏంటో ఒక్కసారి చూద్దాం.
ఢిల్లీ లేడీ డాన్ ‘నేహా’ ప్రియుడితో చిక్కింది
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం డ్రగ్స్ సిండికేట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా. ఈమెని ఢిల్లీ స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఈమెతోపాటు మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ కీలక షూటర్, ఆయుధ సరఫరాదారుడు బాబీ కబూతర్ ఉన్నాడు. నేహాకు ఇతడు చిరకాల భాగస్వామి కూడా.
ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా ఎవరు? ఢిల్లీలోని తూర్పు ప్రాంతంలో బ్యూటీ పార్లర్‌ను నిర్వహించేది. పైకి సాధారణ మహిళగా చలామణి అయ్యేది. బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది. మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో అరెస్ట్ చేసినప్పుడు ఆమె వద్ద భారీగా డ్రగ్స్ దొరికాయి. అంతేకాదు నేహా- బాబీ కబూతర్ ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
తీగలాగితే డొంక కదులుతోంది.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం
నేహా అరెస్టుతో బిష్ణోయ్ గ్యాంగ్‌లో మహిళలు కీలక పాత్రలు పోషించినట్టు తేలింది. గ్యాంగ్‌స్టర్ హషీం బాబా భార్య దీప, జోయా ఖాన్ తర్వాత ఇటీవల అరెస్టైన మూడో లేడీ డాన్ నేహా. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు కీలకంగా వ్యవహరిస్తున్నాడు బాబీ కబూతర్. ఏడేళ్లపాటు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు బాబీ.
నేపాల్-భారత సరిహద్దు ప్రాంతంలో ఇటీవల అరెస్టయిన అక్రమ ఆయుధ వ్యాపారి సలీం నుంచి ఆయుధాలను సేకరించి బిష్ణోయ్ ముఠా సభ్యులకు అందించేవాడట. అంతేకాదు ఆయుధ వ్యాపారి సలీంకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని నాసిర్ గ్యాంగ్‌లో ఉండేవాడు బాబీ కబూతర్. ఆ తర్వాత హషీమ్ బాబాతో కలిసి లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ALSO READ: గోదావరి ఖనిలో కత్తిపోట్ల కలకలం.. కత్తులతో కుటుంబసభ్యుల దాడులు
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బాబీ, బరేలీలోని హీరోయిన్ దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు సరఫరా చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పోయినేడాది ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో ఇద్దరు సోదరులపై జరిగిన కాల్పుల్లో బాబీ కబూతర్ స్వయంగా పాల్గొన్నాడట. రెండేళ్ల కిందట గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన హత్యలో షూటర్లకు లాజిస్టిక్ సాయం అందించాడని తెలుస్తోంది.
సాంకేతిక నిఘా సమాచారాన్ని ఉపయోగించి స్పెషల్ సెల్ ఈ బృందాన్ని అరెస్టు చేసింది. బాబీ, నేహా ఇద్దరూ కస్టడీలో ఉన్నందున, ఆ ముఠా ఆర్థిక జాడలు, రాజధానిలో మిగతా స్లీపర్ సెల్‌ల గురించి మరిన్ని వివరాలను సేకరించడానికి వారిని పోలీసులు విచారిస్తున్నారు.