ప్రధాని మోదీ ఓ కంపెనీ గురించి ప్రచారం చేశారంటే దాన్ని మనం ఎలా చూస్తాం. ఆ కంపెనీ కచ్చితంగా పేరున్నదని, అభివృద్ధిలోకి వెళ్తుందని నమ్ముతాం. అలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎరూ వెనకాడరు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కంపెనీ గురించి పొగిడితే, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? ముందూ వెనకా చూడకుండా ఆ కంపెనీ షేర్లు కొంటారు. అయితే ఇదంతా నిజమే అయితే వాటిని మనం నమ్మొచ్చు. కానీ అలాంటి వీడియోలన్నీ అబద్ధాలు, అసత్యాలు. ప్రధాని మోదీ ఏ కంపెనీకి వత్తాసు పలకరు, ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఫలానా కంపెనీ మంచిది అని ప్రచారం చేయరు. అలా వారు నిజంగానే ప్రచారం చేస్తున్నారని మనం ఆవేశపడితే మన జేబు ఖాళీ అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ హరించుకుపోతుంది. డీప్ ఫేక్ వీడియోలతో మనం నిండా మునిగిపోతాం.
సరికొత్త మోసాలు..
ఆమధ్య రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఓ ట్రేడింగ్ యాప్ గురించి గొప్పగా చెబుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. అసలు అంబానీ లాంటి వ్యక్తి ఓ మామూలు ట్రేడింగ్ యాప్ గురించి ఎందుకు ప్రచారం చేస్తారు అని ఆలోచించిన ఎవరైనా అది బూటకం అని అర్థం చేసుకుంటారు. కానీ అంబానీ అంతటి వ్యక్తే చెప్పారంటే అది ఇంకెంత గొప్పదో అని ఆలోచించేవారుంటే కచ్చితంగా మోసపోతారు. అలా చాలామంది ఆ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకుని పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అంబానీనే కాదు, అమిత్ షా ని, మోదీని కూడా ఇలా ఫేక్ వీడియోలతో వాడేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. వాళ్ల మోసాలబారిన పడొద్దని తెలంగాణ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. వారి ఉచ్చులో పడి మోసపోవద్దని, పరోక్షంగా ఇతరులు మోసపోయేలా ఆ వీడియోలను షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన ఆర్టిఫిషియల్ వీడియోలతో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి ఫేక్ ప్రసంగాలతో తప్పుదారి పట్టిస్తారు జాగ్రత్త. ఇలాంటి వీడియోలను నమ్మొద్దు, ఫార్వార్డ్ చేయొద్దు.#telanganapolice #FakeVideo pic.twitter.com/m4v1ZE8YX0
— Telangana Police (@TelanganaCOPs) July 18, 2025
డీప్ ఫేక్..
ఆమధ్య రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఫేక్ వీడియో అని చెబితే ఎవరూ నమ్మలేనంత సింక్ లో ఉంది ఆ ఫుటేజ్. అలాగే ఇటీవల పలువురు నేతలు నిజంగా మాట్లాడినట్టే లిప్ మూమెంట్ ఇచ్చి వారి వీడియోలు ప్రచారంలోకి తెస్తున్నారు. తమకు అనుకూలంగా ఆయా నేతలు మాట్లాడినట్టు కొన్ని కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ డీప్ ఫీక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది నిజమా కాదా అని తేల్చుకునేలోపే చాలాసార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు కూడా కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలు నిజమే అని నమ్మే పరిస్థితి. అంతలా వాటిని అట్రాక్టివ్ గా తీసుకొస్తున్నారు.
ఏఐతో జాగ్రత్త..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతోంది. అదే సమయంలో నష్టం కూడా ఎక్కువే. ఏఐ టెక్నాలజీతోనే ఇప్పుడు ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇలాంటి వీడియోలను తయారు చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అలా తయారు చేసినా ఎక్కడో ఒక చోట అది ఫేక్ అని తెలిసిపోతుంది. కానీ ఏఐ వచ్చాక ఆ పని సులభం కావడమే కాదు, ఎక్కడా తేడా లేకుండా అచ్చు గుద్దినట్టు ఒరిజినల్ వీడియోలాగే అవి ఉంటున్నాయి. అందుకే చాలామంది సులువుగా మోసపోతున్నారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ ఇతరులకు కూడా హాని చేస్తున్నారు.