Medak News: మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియలు అనంతరం. స్నానం చేయడానికి మంజీరా వాగులో దిగి ఇద్దరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన.. చింతకింది అంజమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో మంగళవారం ఆమె అంత్యక్రియలు గ్రామ సమీపంలోని శ్మశానవాటికలో నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు మంజీరా వాగు వద్దకు స్నానం చేయడానికి వెళ్లారు.
ఈ క్రమంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగిన చింతకింది శ్రీకృష్ణ (16) అనే యువకుడు అకస్మాత్తుగా కాలుజారి లోతైన ప్రాంతానికి జారిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రీకృష్ణను కాపాడేందుకు అతని బంధువు చింతకింది బీరయ్య (38) వాగులోకి దూకాడు. అయితే నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో.. ఇద్దరూ బయటకు రాలేకపోయారు. క్షణాల్లోనే వారు మునిగిపోయారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని.. గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత మృతదేహాలను బయటకు తీశారు.
ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో వరుసగా ముగ్గురు మృతి చెందడంతో పేరూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంజీరా వాగులో ఇటీవల వరద నీరు ఎక్కువగా ఉండటంతో లోతు పెరిగిందని, అదే కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.