Narsingi Incident: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
చెరువులో బట్టలు ఉతకడానికి అమ్మమ్మ యూసుబీ, ఇద్దరు మనమరాళ్లు వెళ్లారు. బట్టలు ఉతికే క్రమంలో కాలుజారీ అమ్మమ్మ చెరువులో పడిపోయింది. చెరువు నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో ఆమె బయటకురావడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.
ఆమె ఆపదలో ఉన్నట్లు గమనించిన మనవరాలు హజీరా భయంతో వెంటనే నీటిలోకి దూకి అమ్మమ్మను రక్షించడానికి ప్రయత్నించింది. కానీ తానూ ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. చెల్లెలు సబియా, చెట్టుకొమ్మను పట్టుకొని బయటపడింది.
గ్రామస్థులు చెరువులోకి దూకి యూసుబీ, హజీరా కోసం గాలించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో అమ్మమ్మ, మనమరాలు ప్రాణాలు కోల్పోయారు. నార్సింగి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో.. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.