Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుంచి చామదల వైపు బయల్దేరిన ఆర్టీసీ బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
కావలి నుంచి చామదలకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. జలదంకి మండలం 9వ మైలు వద్ద ఎదురుగా ఓ లారీ వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కన పొలాల్లో బస్ బోల్తా కొట్టింది. బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు బస్సు లోపల చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. కొంతమంది కిటికీ అద్దాలు పగలడంతో చేతులకు, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ పై విచారణ కొనసాగుతోంది. లారీ డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. అతడిని గుర్తించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.