Lift Incident: హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో ఒక అపార్ట్మెంట్ లిఫ్ట్ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే శుభకార్యానికి హాజరయ్యేందుకు కూతురి ఇంటికి వచ్చిన వృద్ధురాలు, ఊహించని విధంగా లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. సంతోషంగా గడపాల్సిన వేడుకలో ఒక్కసారిగా మరణవార్త వినాల్సి రావడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. షామీర్‌పేటకు చెందిన లక్ష్మమ్మ, లింగయ్య దంపతులు తమ కుమార్తె నివాసం ఉంటున్న రాజేంద్రనగర్ సన్ సిటీలోని మూన్ రాక్ అపార్ట్మెంట్‌కు వచ్చారు. అక్కడ జరిగిన ఒక శుభకార్యంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో లిఫ్ట్ వద్దకు వెళ్లిన లక్ష్మమ్మ.. లిఫ్ట్ లోపలే ఉందని భావించి అడుగు వేశారు. అయితే లిఫ్ట్ అక్కడ లేకపోవడం, కేవలం డోర్ మాత్రమే తెరిచి ఉండటంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. 60 ఏళ్ల వయసులో కళ్లముందే భార్య మృతి చెందడంతో భర్త లింగయ్య కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ప్రమాదానికి అపార్ట్‌మెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు, బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణ (Maintenance) సరిగా లేకపోవడం, సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని విమర్శిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో మేనేజ్మెంట్ విఫలమైందని, వారి బాధ్యతారాహిత్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. నవవధువు మృతి వెనుక వీడని మిస్టరీ ఏంటి?
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.