Cyber Scam: స్వేచ్ఛ బ్యూరో: లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి.. ఇప్పుడే యాప్ డౌన్ లోడ్ చేసుకోండి అంటూ ఫేస్ బుక్ లో కనిపించిన ప్రకటనను నమ్మిన ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ ఖాళీ చేసేశారు. యాప్ లింక్ పై క్లిక్ చేసిన నిమిషాల్లోనే సదరు వ్యక్తి ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకుని రెండు అకౌంట్లలో ఉన్న 1.75లక్షల రూపాయలను కొల్లగొట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసముంటున్న ఓ వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఫేస్ బుక్ ను బ్రౌజ్ చేస్తుండగా లేటెస్ట్ సినిమాలు ఫ్రీగా చూడండి అంటూ ప్రకటన కనిపించింది. దాంతోపాటు ఉన్న లింక్ ను క్లిక్ చేయగానే సదరు వ్యక్తిని అది జీడీపీఆర్.టీయుబీఐ.టీవీ అన్న వెబ్ సైట్ కు తీసుకెళ్లింది. అక్కడి నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న బాధితుడు దానిని ఓపెన్ చేసి ఓ సినిమా చూశాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలకే ఫోన్ లోని సాఫ్ట్ వేర్ ఆటోమేటిక్ గా అప్ డేట్ కావటం మొదలైంది. సాధారణమైన అప్ డేట్ అనుకుని బాధితుడు దానిని పట్టించుకోలేదు.
ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ సరిగ్గా పని చేయకపోవటం, యూపీఐ సేవలు స్పందించక పోవటం, ఇతర యాప్ లు ఓపెన్ కాకపోవటం వంటి సమస్యలు వచ్చాయి. కంగారుపడ్డ బాధితుడు తన బ్యాంక్ యాప్ ను తనిఖీ చేయగా ఖాతా నుంచి 80వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా తెలిసింది. ఇదే మొబైల్ నుంచి నిర్వహిస్తున్న తన తల్లి ఖాతాను చూడగా దాంట్లో నుంచి కూడా 95వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా నిర్ధారణ అయ్యింది. దాంతో బాధితుడు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దీంట్లో డౌన్ లోడ్ చేసిన యాప్ నిజానికి టీయూబీఐ టీవీ కాదని, అదే పేరుతో రూపొందించిన నకిలీ మాల్వేర్ అప్లికేషన్ అని వెల్లడైంది. దీని ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుని ఎస్ఎంఎస్, ఓటీపీల వివరాలు తెలుసుకుని బ్యాంకింగ్ యాప్స్ కు యాక్సెస్ తీసుకుని డబ్బు దోచుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: ఇక నైనా రైతులు మేల్కోనక పోతే సర్వ వినాశనమే: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్!
ఈ క్రమంలో సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ కొన్ని సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫ్రీ మూవీ లింకులను నమ్మవద్దని చెప్పారు. ఏపీకే ఫైళ్లు, గుర్తు తెలియని యాప్ లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ పేర వచ్చే నోటిఫికేషన్లపై క్లిక్ చేయవద్దని తెలిపారు. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్స్ ను అధికారిక ఫోన్ సెట్టింగ్స్ ద్వారానే చేయాలన్నారు. మోసానికి గురైనట్టు తెలిసిన వెంటనే ఇంటర్ నెట్ కనెక్షన్ ను డీ యాక్టివేట్ చేసి అనుమానాస్పద యాప్ లను తొలగించాలని సూచించారు. బ్యాంక్ పాస్ వర్డ్, యూపీఐ పిన్, ఇతర లాగిన్ వివరాలను మార్చి వేయాలని చెప్పారు. అకౌంట్ ఉన్న బ్యాంకుకు ఫోన్ చేసి నగదు ట్రాన్స్ ఫర్ కాకుండా సహాయం తీసుకోవాలన్నారు. దాంతోపాటు 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Also Read: అంతర్జాతీయ క్లయింట్లు.. కళ్లు చెదిరే ఆస్తులు