Nandyal District: న్యూఇయర్ వేళ నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారణాలు ఏమైనా కావచ్చు. ముక్కు పచ్చలారని చిన్నారులను చంపేశాడు కన్న తండ్రి. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను పెంచలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
న్యూఇయర్ వేళ నంద్యాలలో దారుణం
నంద్యాల జిల్లాలోని తుడుముల దిన్నె గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. కన్న తండ్రి ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
నంద్యాల జిల్లాలో ఉయ్యాలవాడ మండలం తుడుముల దిన్నె గ్రామంలో సురేంద్ర-మహేశ్వరి దంపతులు నివాసం ఉండేవారు. సురేంద్ర వయస్సు కేవలం 35 ఏళ్లు. పాతికేళ్ల వయస్సులో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి. కావ్యశ్రీ-7 ఏళ్లు, దానేశ్వరి -4, సూర్య గగన్- రెండేళ్ల వయస్సు.
ముగ్గురు పిల్లలను చంపి, ఆపై తండ్రి ఆత్మహత్య
వారిని చూసి ఆ తల్లిదండ్రులు తెగ మురిసిపోయేవారు. తమ కష్టాలు ఈ ముగ్గురు తీర్చుస్తారని ఇరుగు పొరుగువారికి తండ్రి చెప్పుకునేవాడు. సురేంద్ర భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సంతానం ఎక్కువ కావడంతో పెంచడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత చీటికి మాటికీ గొడవలు పడేవారు.
చివరకు విసుగు చెందిన మహేశ్వరి గతేడాది ఆగష్టు 16న ఆత్మహత్య చేసుకుంది. ఆనాటి నుంచి ముగ్గురు పిల్లలను చూసుకుంటూ వస్తున్నాడు సురేంద్ర. తల్లి లేకుండా పిల్లలను పెంచడం సురేంద్రకు భారంగా మారింది. నాలుగు నెలలు భార్య లేకుండా పిల్లలతో నెట్టుకుంటూ వచ్చాడు. చివరకు జీవితంపై విరక్తి కలిగింది.
ALSO READ: ప్రాణం తీసిన చిట్టీ డబ్బులు, తండ్రీకొడుకులు ఆ వ్యాపారిని కొట్టి చంపేశారు
ఒకానొక దశలో చనిపోవాలని భావించాడు. పిల్లలు అనాథలవుతారని భావించి సైలెంట్ అయ్యాయి. చివరకు డిసెంబర్ 31న రాత్రి ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పాలు ఇచ్చాడు తండ్రి. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం సురేంద్ర ఇంటి నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.
తలుపు కొట్టినా ఎలాంటి సమాచారం లేదు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు తలుపులు ఓపెన్ చేసి చూసేసరికి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం నలుగురు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పిల్లలను పెంచలేక ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు స్థానికులు.