Father Kills Teenager Son Choutuppal: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. స్కూల్ నుంచి లేటుగా వచ్చిన కొడుకుని తండ్రి విచక్షణా రహితంగా కొట్టడంతో బాలుడు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన చౌటుప్పల్ సంచలనం కలిగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.?
చౌటుప్పల్ మండలం ఆరేగూడెంకు చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఫ్యామిలీ చౌటుప్పల్ లోనే నివాసం ఉంటున్నది. చిన్న కొడుకు భాను ప్రసాద్ కు 14 ఏండ్లు ఉంటాయి. చౌటుప్పల్ లోని ఓ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే, తాజాగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ నేపథ్యంలో భాను ప్రసాద్ స్కూల్ లోనే ఉన్నాడు. ఈ కార్యక్రమం అయ్యాక ఇంటికి వచ్చాడు. అప్పటికే రాత్రి 8 గంటలు అయ్యింది.
కొడుకుపై విచక్షణారహితంగా దాడి
అదే సమయంలో తండ్రి సైదులు బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కొడుకు ఆలస్యంగా స్కూల్ నుంచి ఇంటికి రావడంతో కోపంతో ఊగిపోయాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావురా అంటూ అడ్డగోలుగా కొట్టాడు. తను చెప్పేది వినకుండా ఛాతి మీద పిడిగుద్దులు కురిపించాడు. కాలితో తన్నాడు. తండ్రి దెబ్బలను తట్టుకోలేక ఆ అబ్బాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బయట ఉన్న తల్లి ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చే సరికి కొడుకు కిందపడిపోయి ఉన్నాడు. వెంటనే తనను చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెట్లమీది నుంచి కింద పడ్డాడని డాక్టర్లకు చెప్పారు. వైద్యులు పరిశీలించి అప్పటికే అబ్బాయి చనిపోయినట్లు నిర్ధారించారు. ఒక్కసారిగా తల్లి కుప్పకూలిపోయింది.
గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు
ఈ విషయం బయటకు తెలిస్తే ఎక్కడ సైతులు జైలుకు పోవాల్సి వస్తుందోనని భావించి.. వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భావించారు. అర్థరాత్రి సమయంలోనే భాను మృతదేభాన్ని సొంతూరు ఆరెగూడెంకు తీసుకెళ్లారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం పొద్దున్నే దహన సంస్కారాలు చేసేందుక స్మశానవాటికకు తరలించారు.
విషయం తెలియడంతో పోలీసుల ఎంట్రీ
తండ్రి బాలుడిని కొట్టడం వల్లే చనిపోయాని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే నేరుగా స్మశాన వాటికకు చేరుకున్నారు. బాలుడి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం బాలుడి తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అబ్బాయి తండ్రి సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆరెగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో కొడుకు ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు అంటూ గ్రామస్తులు సైదులును తిట్టిపోస్తున్నారు.
Read Also: అన్నయ్యకు టాటా చెప్తూ అనంత లోకాలకు.. హైదరాబాద్ లో ఘోర విషాదం!