Truck Fire: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్యమ్మగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు బాణాసంచా లోడుతో వస్తున్న ఒక లారీ, రోడ్డుపై వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి లారీలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీ అంతటా వ్యాపించాయి.
దద్దరిల్లిన పరిసర ప్రాంతాలు
లారీలో భారీ మొత్తంలో టపాసులు ఉండటంతో అవి ఒక్కసారిగా పేలడం మొదలయ్యాయి. ఈ పేలుళ్ల ధాటికి హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో లారీ నుండి కిందకు దూకేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, లారీతో పాటు అందులోని లక్షల విలువైన సరుకు పూర్తిగా బూడిదైంది.
సమాచారం అందుకున్న వెంటనే కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసింది. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
Also Read: శ్రీరామనవమి రోజే ‘జాగృతి’ జెండా.. కవిత కొత్త ప్రయాణం వెనుక అసలు కథ ఇదే!
హైదరాబాద్-బెంగళూరు హైవేపై బాణాసంచా లారీ దగ్ధం!
మహేశ్వరంలోని మాణిక్యమ్మగూడ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి బాణాసంచా లోడుతో ఉన్న లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా పటాసులు పేలడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.… pic.twitter.com/j1Lx4Npejb
— ChotaNews App (@ChotaNewsApp) March 21, 2026