Kavitha New Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాను స్థాపించనున్న కొత్త పార్టీ పేరు ఖారారు చేశారు. తండ్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే కవిత ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పిన కవిత.. ఆ దిశగా కసరత్తు జరిగినప్పటికీ, ఈసీ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా ఆ ప్రకటన ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫార్మలిటీలు తుది దశకు చేరుకోవడంతో రానున్న శ్రీరామనవమికి ఆమె పార్టీ పేరు, గుర్తు అఫిషియల్‌గా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంట. ఇంతకీ కవిత పార్టీ పేరు, గుర్తు ఏంటి?
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ .. టీపీజే పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరులో తెలంగాణ ఉండేలా తెలంగాణ ప్రజా జాగృతిని స్థాపిస్తున్న కవిత, పార్టీ గుర్తుగా ‘ధర్మగంట’ను నిర్ణయించారు. రానున్న శ్రీరామనవమికి పార్టీని, పార్టీ గుర్తును కవిత అనౌన్స్ చేయనున్నారంట.
కొత్త పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై కల్వకుంట్ల కవితకు న్యూఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్తగా స్థాపించనున్న తెలంగాణ ప్రజా జాగృతి పార్టీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘంను న్యూఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కవిత కొత్త పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్లీ ఈసీఐకి దరఖాస్తు పంపినట్లు కవిత తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఈసీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
జనవరి 23వ తేదీన తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీఐకి కల్వకుంట్ల కవిత దరఖాస్తు చేసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు తన పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కవిత దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా వెల్లడించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావాలని కవిత కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకు తగినట్లుగా వ్యూహాత్మకంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఈ ఏడాది జనవరి 23వ తేదీన తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం.. అందులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. అవి సరిచేసి తిరిగి సమర్పించడం, తాజాగా కోర్టు ఆదేశాలతో కవిత పార్టీ పేరు, రిజిస్ట్రేషన్ల విషయంలో ఊరట లభించింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో, ఎన్నికల సంఘం అభ్యంతరాలు లేకుండా పార్టీ పేరు, గుర్తు ప్రకటిస్తే కవిత పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పార్టీని సర్వోదయ తెలంగాణ అన్న నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లానికి కవిత ప్లాన్ చేస్తున్నారంట. తమ కొట్లాట మొత్తం కాంగ్రెస్ తోనే అని కవిత ప్రకటించారు. భవిష్యత్తులో తమ ఐడియాలజీ సరిపోయే వాళ్లను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు.
పార్టీ ఏర్పాటు చేసే ముందు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులను కలుస్తామని, హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని అనౌన్స్ చేస్తామని కవిత వెల్లడించారు. నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో తెలంగాణ జాగృతికి మంచి పట్టు ఉందని, తమకు ఎలాంటి అజెండా లేదని, ప్రజలే తమ అజెండా అని.. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కవిత అంటున్నారు.
గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు కవిత కార్యాచారణ రూపొందిస్తున్నారంట. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి కింద స్థాయి నుంచి తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని సంస్థాగతం నిర్మించడానికి కవిత కసరత్తు చేస్తున్నారంట. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలకు ధీటుగా ప్రజల్లోకి వెళ్తామని జాగృతి అధ్యక్షురాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక సెంటిమెంట్లు, ముహూర్తాల విషయంలో తండ్రి కేసీఆర్ బాటలోనే కవిత ప్రయాణిస్తున్నారు. కేసీఆర్ మొదట్లో బంగారు తెలంగాణ అన్నారు. ఇప్పుడు కవిత సర్వోదయ తెలంగాణ అంటున్నారు. ఉగాది సందర్భంగా జాగృతి కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. కవిత నక్షత్రం ప్రకారం రానున్న రోజుల్లో విజయ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయని పండితులు చెప్పారంట. వచ్చే ఎన్నికల కల్లా కవిత జాతకంలో గురుడు ప్రవేశించి మంచి ఫలితాల్ని ఇస్తాడని, 2029 ఎన్నికల్లో కవిత మంచి ఫలితాలు సాధిస్తారని వెల్లడించారంట. తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేవారిని కలుపుకుని ముందుకు వెళ్తాం అంటున్న కవిత, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను తట్టుకుని కవిత నిలబడగలరా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా సాగుతోంది .
Also Read: విశాఖ వేదికగా రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన.. ఏపీకి ‘మిట్టల్ స్టీల్’ ప్లాంట్!
Story by: Apparao, Big Tv