Padma Awards in Tollywood: 2025.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సినీ ఇండస్ట్రీ నుండి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ హీరో అజిత్(Ajith), సీనియర్ హీరోయిన్ శోభన (Shobhana) లకు భారత దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఎవరు ఏ వయసులో పొందారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అక్కినేని నాగేశ్వరరావు..
తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభం అయిన అక్కినేని నాగేశ్వరరావు (ANR) తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ (NTR) కంటే ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్, తన అద్భుతమైన నటనతో అందరిని అబ్బురపరిచారు. ఎక్కువగా అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు దక్కించుకున్న ఈయన.. నాటక రంగం ద్వారానే తొలి అడుగులు వేసి, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన నేపథ్యంలో 1988లో ఆయనకు 64 సంవత్సరాల వయసున్నప్పుడు భారత మూడవ అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు 2011లో 87 సంవత్సరాల వయసులో ‘పద్మ విభూషణ్’ అవార్డును అందుకోవడం జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, స్వయంకృషితో ఎదిగి, నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్న చిరంజీవి (Chiranjeevi) 2006లో ఆయనకు 51 సంవత్సరాల వయసున్నప్పుడు ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నారు. అంతేకాదు అందరికంటే తక్కువ వయసులో పద్మభూషణ్ అవార్డు అందుకున్న నటుడిగా చిరంజీవి టాలీవుడ్ లో రికార్డు సృష్టించారు. ఇక గత ఏడాది (2024 ) కూడా చిరంజీవి ‘పద్మ విభూషణ్’ అందుకోవడం జరిగింది. గత ఏడాది ఆయన 69 సంవత్సరాల వయసులో పద్మ విభూషణ్ అందుకొని అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ..
నటసింహ నందమూరి బాలకృష్ణ(Balakrishna ) ఈ ఏడాదికి గానూ ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు. ఇకపోతే ఇటీవలే ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. మరొకవైపు ఈ వయసులో కూడా వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు సన్మాన సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ:
దివంగత నటులు తెలుగు సినీ పరిశ్రమ అత్యధికంగా అభివృద్ధి చెందడానికి తన వంతు కృషిచేసిన సూపర్ స్టార్ కృష్ణ (Krishna) 66 సంవత్సరాల వయసులో 2009లో ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అత్యాధునిక టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత కూడా ఈయన సొంతం. ఇక సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో అపురూప పాత్రలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నాయని చెప్పవచ్చు.