Mumbai: అసలే ఎండాకాలం.. సమ్మర్‌లో వచ్చే పండ్లను విస్తారంగా ఉపయోగిస్తారు ప్రజలు. అందులో వాటర్ మిలాన్ ఒకటి. ఎక్కువమంది దీన్ని తీసుకుంటారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, పైగా జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుందని నమ్ముతారు. ఓ ఫ్యామిలీ బిర్యానీ నాలుగు గంటల గ్యాప్ తర్వాత వాటర్ మిలాన్ తీసుకున్నారు. ఒకరి తర్వాత మరొకరు ఫ్యామిలీ అంతా మృతి చెందారు. సంచలనం రేపిన ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
ముంబైలో షాకింగ్.. ఓ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బంధువులతో కలిసి బిర్యానీ తీసుకున్నారు నలుగురు సభ్యుల ఫ్యామిలీ. ఆ తర్వాత నాలుగు గంటల గ్యాప్ ఇచ్చిన తర్వాత పుచ్చకాయ తిన్నారు. కొద్దిసేపటికి ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురయ్యారు. కేవలం 12 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందినవారిలో 13 ఏళ్ల బాలిక ఉంది. ఫుడ్ పాయిజనింగ్ జరగడంతో మృతి చెందినట్టు పోలీసులు అనుమానం.
ముంబైలో 40 ఏళ్ల అబ్దుల్లా అబ్దుల్ కాదర్ మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమ్మాయిల వయస్సు ఒకరికి 16 ఏళ్లు, మరొకరికి 13 ఏళ్లు ఉంటాయి. వీకెండ్ కావడంతో శనివారం రాత్రి బంధువులు ఇచ్చిన విందుకు అబ్దుల్లా ఫ్యామిలీ హాజరైంది. ఆ విందులో అబ్దుల్లా ఫ్యామిలీ బిర్యానీని ఆరగించింది. విందు తర్వాత ఇంటికి చేరుకున్నారు.
తొలుత బిర్యానీ.. ఆ తర్వాత పుచ్చకాయ తీసుకున్నారు
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా ఫ్యామిలీ పుచ్చకాయ తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత అంతే ఆదివారం ఉదయం 5 గంటలకు ఆ కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే అబ్దుల్లా స్థానికంగా ఉండే డాక్టర్‌ని పిలిచి జరిగింది చెప్పాడు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా మారడంతో అబ్దుల్లా ఫ్యామిలీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నుంచి ఒకరి తర్వాత మరొకరు నలుగురు సభ్యులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ALSO READ: కమలాపూర్‌లో ఉద్రిక్తత.. స్థానిక మేస్త్రీలపై వలస కార్మికుల దాడి!
12 గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి వెనుక కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు. అబ్దుల్లా ఫ్యామిలీ తిన్న పుచ్చకాయ ముక్కను పరీక్ష కోసం పంపారు. మృతదేహాల నుండి నమూనాలను సేకరించినట్టు ముంబై పోలీసు డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ ముండే తెలిపారు.
ఆ ఫ్యామిలీ తిన్న పుచ్చకాయలో ఏదైనా విష పదార్థం ఉందా? ఈ కోణంలో మహారాష్ట్ర ఆహార-ఔషధ పరిపాలన విభాగం విచారణ చేస్తోంది.నివేదిక వచ్చే వరకు మృతికి గల కారణాలు చెప్పలేమని చెబుతున్నారు.