Dussehra Celebrations USA: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.. దసరా పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, సంగీతంతో నిండిన అద్భుత వేడుకలను నిర్వహించి సంస్కృతీ వైభవాన్ని ప్రదర్శించారు. అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో.. రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ దసరా ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా సాగాయి.
ప్రధాన అతిథిగా సుందర్ రాజ్ యాదవ్
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు సినీ లిరిక్స్ రచయిత, “బలగం” మూవీ బెస్ట్ లిరిక్స్ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్, ప్రముఖ ఫోక్ సింగర్స్ రేలారే గంగా, దాండియా శ్రీను, అమెరికాలోని ఎన్నారై కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జానపద గీతాలు, రామలీలా, నృత్యాలు
సాయంత్రం ప్రారంభమైన వేడుకలు రాత్రి వరకు సాగాయి. వేదికపై తెలుగు జానపద గీతాలు, రామలీలా ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కచేరీలు ఆడియన్స్‌ను అలరించాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ఉత్సవాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. “ధూంధాం” పాటలతో, జానపద నృత్యాలతో వేదిక కిక్కిరిసిపోయింది.
చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి
ఈ సందర్భంగా మీడియాతో సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. దసరా పండుగ మనలో సత్యం, ధర్మం, ధైర్యం అనే విలువలను నింపుతుంది. మన తెలుగు సంఘాలు విదేశాలలో కూడా ఇంత అద్భుతంగా ఉత్సవాలు నిర్వహించడం.. మన సంస్కృతి జీవం ఉన్నదనే నిదర్శనం అని పేర్కొన్నారు.
ATA తెలుగు సంఘం కృషి ప్రశంసనీయం
ATA ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగు ఈ ఉత్సవాలు.. అమెరికాలోని తెలుగు కుటుంబాలను ఒక్కచోట చేర్చుతున్నాయని ఆయన అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు అంటే పండుగలతో వచ్చే ఐక్యత. కుటుంబాలతో, స్నేహితులతో కలిసి పూజలు, ఆటపాటలు జరుపుకోవడం అనేది మన భారతీయతకు చిహ్నం. ఈ ఉత్సవం దానికి మంచి ఉదాహరణ అని సుందర్ రాజ్ యాదవ్ చెప్పారు.
శమీపూజ, దాండియా, ఆటపాటలు ఆకట్టుకున్నాయి
ఈ కార్యక్రమంలో శమీపూజ కూడా నిర్వహించబడింది. అనంతరం దాండియా ఆటలు, మహిళల కోసం ప్రత్యేక సాంస్కృతిక పోటీలు, పిల్లల కోసం డ్రామా, సింగింగ్ కార్యక్రమాలు నిర్వహించగా ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి వయసు వారు ఆత్మీయతతో పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.
ప్రవాసులు సంస్కృతికి వారసులు
సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతిని కొనసాగిస్తూ ఇలాంటి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ప్రతి ఏటా మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాలని ఆశిస్తున్నాను. మన పిల్లలకు ఈ ఉత్సవాలు మన మూలాలను గుర్తుచేస్తాయి అని తెలిపారు.
ఎన్నారైలు సంబరాల్లో మునిగిపోయారు
ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్నారైలు ఉత్సాహంగా సంబరాల్లో మునిగిపోయారు. కొందరు సాంప్రదాయ వంటకాలతో బహిరంగ విందును ఏర్పాటు చేయగా, మరికొందరు సంగీత ప్రదర్శనల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. “తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేలా ఈ వేడుకలు నిలిచాయి అని ఎన్నారైలు పేర్కొన్నారు.
సాంస్కృతిక వారసత్వానికి కొత్త దారులు
ATA అధ్యక్షులు మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడం. దసరా, సంక్రాంతి, ఉగాది వంటి పండుగల ద్వారా మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాలను పిల్లలకు పరిచయం చేయడమే అని అన్నారు.