విజయ దశమి సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్-1’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. నటుడిగా, దర్శకుడిగా మరోసారి అదరగొట్టాడు రిషబ్ శెట్టి. ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. అయితే, ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఇందులో నటించిన యువ నటుడు రాకేష్ పూజారి(34)ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అద్భుతమైన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడంటూ అభినందిస్తున్నారు. దురదృష్టవశాత్తు రాకేష్ ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమలో రాణిస్తున్న ఆయన.. కేవలం 34 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఆయను స్మరించుకుంటున్నారు.
ఎంతో భవిష్యత్ ఉన్న కన్నడ హాస్య నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఏడాది మే 11న ఆయన స్నేహితుడి మెహందీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, మార్గం మధ్యలోనే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫార్మ్ చేశారు. రాకేష్ మృతితో కన్నడ సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. సామాన్యుల నుంచి సినీ ప్రముఖల వరకు ఆయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ లాంటి నటుడిని కోల్పోవడం నిజంగా కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు. ‘కాంతార’ చిత్ర బృందం కూడా రాకేష్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చిత్రబృదం సైతం కన్నీటి ఘన నివాళి అర్పించింది.
రాకేష్ పూజారి కన్నడ రియాలిటీ షో ’కామెడీ కలాడిగలు’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ షోలో సీజన్-3 విజేతగా నిలిచి బుల్లితెరతో పాటు వెండితెర పైనా అవకాశాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘కడలే బాజిల్’ అనే తుళు రియాలిటీ షోలో పాల్గొని ఇంకా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ‘అమ్మేర్ పోలీస్’, ‘ఉమిల్’ లాంటి కన్నడ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. పలు తుళు చిత్రాల్లోనూ నటించాడు. అదే సమయంలో ‘కాంతార చాప్టర్-1’లో నటించాడు. షూటింగ్ జరుగుతుండగానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.
నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ‘కాంతార చాఫ్టర్ 1’ దసర కానుకగా అక్టోబర్ 2న విడుదల అయ్యింది. హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మొత్తం 7 భాషల్లో 7 వేల థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు రిషబ్ శెట్టి. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Read Also: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!