Wife Axe Husband| దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు మరవక ముందే ఇలాంటిదే మరో భయానక ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివాహం జరిగిన 15 రోజులకే తన భర్తను ఓ మహిళ హత్య చేసింది. మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణంలో జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. సాంగ్లీ పట్టణానికి చెందిన 54 ఏళ్ల భర్త అనిల్ తనాజీ లోఖండేని అతని భార్య రాధికా బాలకృష్ణ ఇంగ్లే హింసాత్మకంగా గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన భర్తల దీర్ఘాయుష్షు కోసం భార్యలు ప్రార్థించే వట్ పూర్ణిమ రోజున జరగడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం.. 54 ఏళ్ల అనిల్ తనాజీ లోఖండేకి గతంలో వివాహం జరిగింది. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిద్దరూ కూడా వివాహం చూసుకొని మరో ప్రాంతంలో నివసిస్తున్నారు. కానీ కొన్ని నెలల క్రితం అనిల్ లోఖండే భార్య క్యాన్సర్ కారణంగా చనిపోయింది. దీంతో అనిల్ ఇంట్లో ఒంటరి వాడైపోయాడు. పైగా అతను కూడా అనారోగ్యంతో బాధపడుతుండగా.. అతని సమీప బంధువు అతనికి రెండో వివాహం చేసుకోవాలని సూచించాడు.
అంతేకాదు అతని కోసం వారి బంధువులలో ఒకరి కూతురు అయిన 27 ఏళ్ల యువతి రాధికా బాలకృష్ణ ఇంగ్లేతో వివాహం నిశ్చయించాడు. అలా వారిద్దరికీ 15 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. కానీ పెళ్లి తరువాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం జూన్ 10 రాత్రి మరోసారి గొడవ జరిగింది. ఆ తరువాత అనిల్ నిద్రపోవడానికి వెళ్లిపోయాడు. రాత్రి 11:30 నుంచి 12:30 గంటల మధ్య అనిల్ నిద్రిస్తున్న సమయంలో రాధికా అతని తల, చేతులపై గొడ్డలితో దాడి చేసి, అక్కడికక్కడే చంపింది. హత్య తర్వాత రాధికా తన బంధువుకు ఈ విషయం తెలిపింది. ఆ తరువాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమె పోలీసు కస్టడీలో ఉంది. కుటుంబ వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదని సరైన కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
Aslo Read: భర్త, పిల్లలుండగా ఆమెకు ఇద్దరు ప్రియులు.. కుటుంబానికి భోజనంలో విషం కలిపి
ఇటీవలే ఇదే విధమైన ఘటనలో సోనమ్ రఘువంశీ అనే మహిళ తన భర్తను హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. హనీ మూన్ పేరుతో మేఘాలయ కొండప్రాంతాలకు తీసుకెళ్లి.. అక్కడ ముగ్గురు కిరాయి హంతకులతో నరికి హత్య చేయించింది. ఆ తరువాత భర్త శవాన్ని కొండ మీద నుంచి లోయలో పారవేసింది. ఈ హత్య వారి వివాహం జరిగిన (మే 11) ఒక నెల తర్వాత జరిగింది. హత్య తరువాత వారం రోజుల వరకు పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితమే పోలీసులు ఆమెను ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక ఢాబాలో అపాస్మారక స్థితిలో కనుగొన్నారు. ఆ తరువాత నాటకీయంగా సాగుతున్న విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది.