Anantapur Crime News: అనంతపురం జిల్లాలో సంచలనం రేపింది యూట్యూబర్ తిరుమలరెడ్డి హత్య కేసు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, ట్రాక్టర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేశారు.
అసలేం జరిగింది?
కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన తిరుమల రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లులో నివాసం ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లే సమయంలో ఫిబ్రవరి 17న దారుణంగా హత్యకు గురయ్యాడు. అయితే జీవన్‌కుమార్- తిరుమలరెడ్డిల మధ్య భూమికి సంబంధించిన వివాదం ఉండేది. జీవన్‌కుమార్ తన నాలుగు ఎకరాల పొలం పక్కనే ప్రభుత్వానికి సంబంధించి ఎకరం భూమి ఉంది.
తన భూమితోపాటు ప్రభుత్వ స్థలాన్ని సాగు చేస్తున్నాడు. ఈ విషయంపై BVR యూట్యూబ్ నిర్వాహకుడు తిరుమల రెడ్డి తహసీల్దారుకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అతడి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయాడు జీవన్‌కుమార్. అంతేకాదు తాను ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంపై పగతో రగిలిపోయాడు.
తిరుమలపై కక్షతీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి పక్కాగా స్కెచ్ వేశాడు. తిరుమలరెడ్డి ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడదే దానిపై వివరాలు సేకరించాడు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుమలరెడ్డి వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నాడు. కక్ష తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాడు.
ALSO READ: యువతిపై గ్యాంగ్ రేప్.. పట్టించుకోని భర్త
తీగలాడితు డొంక కదిలిందిలా?
ఇద్దరి సాయంతో ట్రాక్టరుతో తిరుమల రెడ్డి టూ వీలర్స్ ఢీ కొట్టించాడు. ఆ వెంటనే తనతో తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని హంద్రీనీవా కాలువలో పడేశారు. తిరుమలరెడ్డి కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు హంద్రీనీవా కాలువలో ఓ వ్యక్తి బాడీ దొరికింది. ఈ ఘటనపై అన్ని వివరాలు సేకరించారు. అసలు నిందితులు ఎవరనేది పోలీసులకు మిస్టరీగా మారింది.
ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని తిరుగుతున్నారు. చివరకు నిందితులను వలపన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు తహసీల్దారు కార్యాలయం వద్ద అరెస్టు చేశారు సీఐ ప్రవీణ్‌కుమార్. ప్రధాన నిందితుడు జీవన్‌కుమార్‌తో పాటు అతనికి సాయపడిన రామన్న, రామాంజనేయులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ట్రాక్టరుతో పాటు ద్విచక్ర వాహనం, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఐదు రోజుల్లో ఈ కేసు చేధించారు పోలీసులు.