Gangrape Wife Kills Husband | తనపై సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పినా భర్త పట్టించుకోవడం లేదనే కోపంతో ఓ యువతి మరో వ్యక్తితో వివాహేతం సంబంధం పెట్టుకుంది. చివరకు ఆ ప్రియుడి సాయంతో ప్లాన్ చేసి తన భర్తను హత్య చేసింది. అయితే ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని మైన్పురి జిల్లా భౌవ్ గావ్ గ్రామానికి చెందిన ఆమ్నా అనే యువతితో కొన్ని సంవత్సరాల క్రితం సాజిద్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే 2022లో అదే గ్రామానికి చెందిన భోళా యాదవ్, అతని కుమారుడు తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆమ్నా ఆరోపణలు చేసింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసింది. అయితే.. పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఆమె ఆరోపణలు నిజం కాదని 2022 డిసెంబర్ లో కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు.
అయినా ఆమ్నా వెనుకడుగు వేయలేదు. ఆమె తన భర్త మహమ్మద్ సాజిద్ ద్వారా 2023 జనవరి లో కోర్టులో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని మరో పిటిషన్ దాఖలు చేయించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది. 2025 ఫిబ్రవరి 20న కోర్టు విచారణ జరగనుంది. కానీ ఇంతలోనే ఆమ్నా భర్త సాజిద్ కనబడకుండా పోయాడు. చాలా రోజులగా తన కొడుకు కనిపించడం లేదని సాజిద్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కోడలు ఆమ్నా, భోళా యాదవ్ లపై అనుమానం వ్యక్తం చేశాడు.
Also Read: భార్యను వేధించాడని.. జ్యోతిష్యుడిని చాకుతో పొడిచి.. పెట్రోల్ పోసి
అయితే సాజిద్ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమ్నా, సాజిద్ ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని.. ఆమ్నా మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని తెలిసింది. ఆ యువకుడి పేరు సుమీత్. పైగా సాజిద్ సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే.. సుమీత్ కూడా సాజిద్ చివరగా కనిపించిన ప్రాంతంలో ఉన్నాడని తెలిసింది.
ఈ ఆధారాలతో ఆమ్నా, ఆమె ఫ్రెండ్ సుమీత్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. దీంతో సుమీత్ భయపడి పోయి మొత్తం నిజం చెప్పేశాడు. ఆమ్నాపై కోర్టులో విచారణలో ఉన్న సామూహిక అత్యాచారం కేసులో ఆమె భర్త సహకరించడం లేదని.. అందుకే అతని గొడవలు పడి తనతో స్నేహంగా ఉండేదని చెప్పాడు. పైగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ కారణంగానే ఆమ్నా తన భర్తను చంపేందుకు నిర్ణయించుకుంది.
ఇందుకోసం ఫిబ్రవరి 16న తన భర్త సాజిద్ భోజనం, టీలో నిద్ర మాత్రలు కలిపింది. ఆ తరువాత సాజిద్ నిద్రపోయినప్పుడు సుమీత్ ను పిలిచింది. నిద్రపోతున్న సాజిద్ తలపై సుమీత్ ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టాడు. ఆ తరువాత సాజిద్ శవాన్ని ఆమ్నా, సుమీత్ లు కలిసి ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి.. ఎవరూ గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు.
పోలీసులు కాలిపోయిన సాజిద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ విషయాలన్నీ తెలిసి సాజిద్ తండ్రి పట్టరాని దు:ఖంలో మునిగిపోయాడు.