Kuppam News: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకునేందుకు కుప్పం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాహనంతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. వారిని పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు. అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లాలో కొన్నాళ్లుగా హర్యానా దొంగలు నానాహంగామా చేస్తున్నారు. అయితే వారంతా ఓ ముఠాగా ఏర్పడి కారులో ఏపీ సరిహద్దు దాటుతున్నాట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. డిఎస్పీ సూచనలతో పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారి తంబిగానిపల్లె ప్రాంతంలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
రాత్రి పదిన్నర గంటల సమయంలో పలమనేరు నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన స్కార్పియోను పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ముందుకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించింది దొంగల గ్యాంగ్. కారును వెనక్కి పోనిచ్చి కానిస్టేబుళ్లపై ఎక్కించేందుకు యత్నించింది.
పోలీసులు ఆ సమయంలో పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. హర్యానా దొంగల ముఠాగా నిర్ధారించుకున్న పోలీసులు, తమ తొపాకులతో ఓ రౌండ్ కాల్పులు జరిపారు. దొంగలు వేగంగా కారుతో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో గాలింపు తీవ్రతరం చేశారు.
ALSO READ: కామాంధుడైన ప్రియుడికి కూతుర్ని బలిచ్చిన కన్నతల్లి
పరమ సముద్రం చెరువు సమీపంలో నిందితులు కారును వదిలి పారిపోయారు. హర్యానా దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తునారు. పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేసినట్టు నిర్ధారించారు. కారులో ఐదు మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వారి కోసం సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు. ఇంకోవైపు డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయా ప్రాంతాల ప్రజలను కోరారు పోలీసులు.