Indian Railways: IRCTCలో టికెట్ల బుకింగ్ వ్యవహారంపై గత కొంత కాలంగా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో పెద్ద వ్యవహారం నడుస్తుందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బుకింగ్ విండోను తెరిచిన క్షణాల్లోనే టికెట్లు అయిపోయినట్లు నోటిఫికేషన్ రావడం పట్ల చాలా మంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తేలింది. దేశ వ్యాప్తంగా ఓ ముఠా ఈ టికెట్ల బ్లాక్ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. నకిలీ ఐడీలు, బాట్ లు ఉపయోగించి రైల్వే టికెట్లను బ్లాక్ చేసినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దేశం అంతటా ప్రయాణీకులను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య వెనుక ఉన్న భారీ స్కామ్‌ను బయటపెట్టారు.
5 నిమిషాల్లో 2.9 లక్షల టికెట్లు బ్లాక్
జనవరి, మే మధ్యలో బుకింగ్ విండో తెరిచిన ఐదు నిమిషాల్లోనే 2.9 లక్షల అనుమానాస్పద టికెట్ బుకింగ్‌లను (PNRలు) IRCTC గుర్తించింది. ఈ టికెట్లు బుక్ చేసిన వాళ్లు సాధారణ ప్రయాణీకులు కాదు. టికెట్లను బ్లాక్ చేయడానికి ఆటోమేటెడ్ బాట్ లు, ఫేక్ ఐడీలు ఉపయోగించే కేటుగాళ్లు. ఇదే సమయంలో 2.5 కోట్లకు పైగా నకిలీ యూజర్ ఐడీలు డీయాక్టివేట్ చేయబడ్డాయి. మరో 20 లక్షల ఐడీలు తిరిగి వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేయబడ్డాయి. వీటిపై ఫోకస్ పెట్టిన రైల్వే అధికారులు.. ఈ ఖాతాలలో ఎక్కువగా డిస్పోజబుల్ ఇమెయిల్ అడ్రస్ లు సృష్టించినట్లు గుర్తించారు. తాత్కాలిక ఇమెయిల్ ఐడీలు కొన్ని సార్లు మాత్రమే ఉపయోగించినట్లు గుర్తించారు. వీటి ద్వారా నిందితులను గుర్తించడం కష్టమైందని రైల్వే అధికారులు వెల్లడించారు.
అధిక ధరలకు టికెట్ల అమ్మకం
అక్రమ పద్దతుల ద్వారా పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసిన కేటుగాళ్లు, ఆ తర్వాత వాటిని నిజమైన ప్రయాణీకులకు అధిక ధరలకు అమ్మేవారు. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో, రద్దీగా ఉండే ప్రయాణ సీజన్లలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో టికెట్ బుక్ చేసుకునే వ్యక్తి నిజమైన ప్రయాణీకుడా? లేదంటే సాఫ్ట్ వేర్ బాటా? అని గుర్తించేందుకు IRCTC ఇప్పుడు యాంటీ-BOT టెక్నాలజీని అమలు చేస్తోంది. దానితో పాటు, బుకింగ్ వ్యవస్థను వేగవంతం చేయడానికి, భద్రపరచడానికి లీడింగ్ కంటెంట్ డెలివరీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
Read Also: 2 జతల రైళ్లు, వారానికి 6 రోజులు.. కాశ్మీర్ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ ఇవే!
అక్రమంగా టికెట్లు బ్లాక్ చేయడంపై రైల్వే ఫోకస్
అక్రమ మార్గాల ద్వారా టికెట్లు బుక్ చేయడంపై రైల్వే ఫోకస్ పెట్టింది. 6,800 కి పైగా నకిలీ ఇమెయిల్ డొమైన్‌లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. అక్రమంగా టికెట్లు బ్లాక్ చేయడం వల్లే నిజమైన ప్రయాణీకులకు టికెట్లు దొరకడం లేదని అభిప్రాయపడింది. కన్ఫర్మ్ టికెట్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది. దీనిని తగ్గించేందుకు రైల్వే మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రద్దీగా ఉండే మార్గాల్లో సీట్ల సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Read Also: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఫస్ట్ 10 నిమిషాలు వారికే ప్రయారిటీ!