Nellore Lady Don Kamakshi: నెల్లూరులో గంజాయి విక్రయాలకు అడ్డుపడుతున్నాడని సీపీఎం నేత పెంచలయ్యను అతి కిరాతకంగా హత్య చేశారు. గంజాయి గ్యాంగ్ నడిపిస్తున్న లేడీ డాన్ అరవ కామాక్షి అలియాస్ కామాక్షమ్మ పోలీసులు అరెస్టు చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మ కుట్రదారుగా పోలీసులు గుర్తించారు. నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్న పెంచలయ్య ఎలక్ట్రిషియన్ పని చేస్తూ జీవించేవారు. సీపీఎంలో యాక్టివ్ గా ఉండేవారు. ఆర్డీటీ కాలనీలోని ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆర్డీటీ కాలనీలో గంజాయి విక్రయాలు, వినియోగాన్ని గమనించిన పెంచలయ్య వాటిని అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కామాక్షి ఆధ్వర్యంలోనే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందించారు పెంచలయ్య. దీంతో పెంచలయ్యపై కక్ష పెంచుకున్న గంజాయి ముఠా.. గత శుక్రవారం సాయంత్రం కుమారుడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న పెంచలయ్యపై దాడి చేశారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గంజాయి గ్యాంగ్ పెంచలయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న కామాక్షితో పాటు, మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెంచలయ్య హత్యతో గ్రామస్థులు ఆగ్రహంతో లేడీ డాన్ అరవ కామాక్షి ఇంటిని కూల్చివేశారు. హౌసింగ్ బోర్డు ఆర్డీటీ కాలనీలోని కామాక్షి ఇంటిని సోమవారం రాత్రి స్థానికులు కూల్చివేశారు. కామాక్షిపై గంజాయి కేసుతో పాటుగా ఇతర తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటికి కూల్చివేశారు. సోమవారం రాత్రి కామాక్షి ఇంటితో పాటుగా ఆమె అనుచరుల ఇళ్లను ధ్వంసం చేశారు. మంగళవారం పోలీసులు కామాక్షి ఇంటి వద్ద తనిఖీలు చేయగా ఇంటి గోడల్లో దాచిన కత్తిని పోలీసులు గుర్తించారు. అలాగే ఆమె ఇంట్లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై కామాక్షి తమ ప్రాంతంలోకి రానివ్వమని స్థానికులు గట్టిగా చెబుతున్నారు.
Also Read: Student Suicides: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..
2019 నుంచి కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆర్డిటీ కాలనీలో గంజాయి విక్రయాలపై స్థానికులు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు. అయినా సరే కామాక్షి దౌర్జన్యాలు, దాడులకు భయపడి ఎవరూ బహిరంగంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీపీఎం నేత పెంచలయ్య మాత్రం కామాక్షి ముఠా ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు. గంజాయి దందా ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో.. పెంచలయ్యపై దాడి చేసి హత్య చేశారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు హత్య చేయడం దుర్మార్గమని స్థానికులు మండిపడ్డారు. టీడీపీ, సీపీఎం నేతలు కామాక్షికి చెందిన అయిదు ఇళ్లను ధ్వంసం చేశారు.