Lorry Accident: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఒక భారీ లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లా నుండి మహారాష్ట్రలోని బళ్లార్షకు కలప లోడుతో వెళ్తున్న ఒక లారీ.. కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిపై హుజూరాబాద్ పట్టణం గుండా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి మార్గమధ్యలో ఉన్న ఒక చెట్టును, అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
అంతటితో ఆగకుండా.. వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కనే ఉన్న ఒక ఫర్నిచర్ షాపు ముందు ప్రదర్శనకు ఉంచిన సోఫాలు, ఇతర సామాగ్రిపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ జనం రద్దీగా ఉన్నప్పటికీ.. లారీ రాకను గమనించిన స్థానికులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఫర్నిచర్ షాపు యజమానికి భారీగా నష్టం వాటిల్లింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. స్వల్ప గాయాలైన అతడిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసుకున్నారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఇలాంటి ఘటన జరగడం పట్టణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.