CP Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ‘కల్తీ’గాళ్లను ఉక్కుపాదంతో అణచి వేస్తామని హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ చెప్పారు. ఆహార కల్తీ కేవలం నేరం మాత్రమే కాదు సమాజంపై జరుగుతున్న దాడి అని అన్నారు. ఎంతో ప్రేమతో పసి పిల్లలకు తినిపించే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ ల నుంచి మొదలు పెట్టి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు అన్ని వస్తువుల్లో విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలను ఇకపై సహించమని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Modugunta Lake: చెరువును మింగేసిన తిమింగలాలు.. 40 ఎకరాల చెరువు 4 ఎకరాలకే పరిమితమా..?
ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయమన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ లో కల్తీరాయుళ్ల ఆట కట్టించేందుకు H-FAST బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. గడిచిన నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేసి, 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేసి 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను ఫణంగా పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కల్తీ లేని సమాజం..సురక్షితమైన ఆహారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also read: Tax Disparity: బీజేపీ యేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి