Tax Disparity: స్వేచ్ఛ బ్యూరో: బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని, అదే బీజేపీ అధికారంలోనున్న రాష్ట్రాలకు వారు చెల్లిస్తున్న పన్నుల కన్నా ఎన్నో రేట్లు అధికంగా నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్ళించారు. సోమవారం శాసన సభలో తెలంగాణ వ్యాల్యూ ఆడెడ్ టాక్స్ (టీ వ్యాట్), (రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్) మోబిలిటీ సవరణ బిల్లు–2026ను సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. బిల్లుపై సభ్యులు పాయల్ శంకర్, కూనమనేని సాంబశివరావు, దానం నాగేందర్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ రిలయన్స్ కు సపోర్టు చేయడానికా? నష్టాన్ని నివారించడానికా? అంటూ వ్యాఖ్యానించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని కేంద్రం రూ.10 తగ్గించిన సుంకాన్ని ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు.
దానం నాగేందర్ జోక్యం చేసుకుని పాయల్ శంకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రిలయన్స్ సంస్థ ఎవరి ఆధీనంలో ఉందని ప్రశ్నించారు. బిల్లు ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో మొదటి అమ్మకపు దశలో మాత్రమే పన్ను విధించే నిబంధనను రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ తమ అంతర్గత లావాదేవీల ద్వారా అనుకూలంగా మార్చుకుంటున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు వివరించారు. ఈ లోపాన్ని సరిదిద్ది, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్ను వాటాను సక్రమంగా రాబట్టేందుకు ఈ సవరణ అనివార్యమైందన్నారు. జూన్ 18, 2025న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read: ఆయుధాలు వీడండి.. జనంలోకి రావాలని మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
ఈ బిల్లు ప్రధానంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడం, ఇంధన విక్రయాలలో పన్ను లొసుగులను అరికట్టడం లక్ష్యంగా రూపొందించినట్లు తెలిపారు. 2020 నుంచి రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్న ఎవరు పట్టించుకోలేదని, దీన్ని గుర్తించిన ప్రభుత్వం 2025 లో ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ద్వారా జూలై 2024-25 వ్యాట్ ఆదాయం రూ. 220 కోట్లు సగటున 28 కోట్లు, నోటిఫికేషన్ తర్వాత జూలై 20 నుంచి ఫిబ్రవరి 2026 వరకు రూ. 250 కోట్లు సగటున రూ.30 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు. మొత్తంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 47 కోట్లు ఆదాయం సమకూరనున్నట్లు వెల్లడించారు. రిలయన్స్ కు సపోర్టు చేయడానికా? నష్టాన్ని నివారించడానికా? అనేది విపక్షాలకు చెందిన సభ్యుల విజ్ఞతకే వదిలి వేస్తున్నానని బీజేపీ సభ్యుల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు వసూలు చేస్తోంది. 2018-19 నుంచి 2024-2025 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.రూ.4.60 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించిందన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రాన్ని బదలాయింపులు గ్రాంట్ల రూపంలో తిరిగి పొందింది కేవలం రూ. 1.36 లక్షల కోట్లు మాత్రమేనని మంత్రి వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం 2018-19 ఆర్తిక సంవత్సరంలో కేంద్రానికి రూ.84 వేల 622 కోట్లను వివిధ రకాల పన్నులుగా చెల్లించగా, కేంద్రం ఇచ్చింది రూ. 2 వేల 56 కోట్లు మాత్రమేనని, కర్ణాటక రాష్ట్రం రూ. 16 లక్షల 17 వేల 53 కోట్లు కేంద్రానికి చెల్లించగా, కేంద్రం కర్ణాటకకు రూ. 2 లక్షల 44 వేల 48 కోట్లు మాత్రమే చెల్లించిందని, మధ్యప్రదేశ్ కేంద్రానికి రూ. 2 లక్షల 60 వేల కోట్లను చెల్లించగా, కేంద్రం ఆ రాష్ట్రానికి రూ. 4 లక్షల 86 వేల కోట్లను కేటాయించిందని, బీహార్ రాష్ట్రం కేంద్రానికి రూ. 93 వేల 556 కోట్లను చెల్లించగా, కేంద్రం ఆ రాష్ట్రానికి ఏకంగా రూ. 6 లక్షల 20 వేల 487 కోట్లను కేటాయించిందని, ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఒక విధంగా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మరోలా వ్యవహరిస్తోందని, ఏ ప్రామాణికం ఆధారంగా కేంద్రం ఇలా వ్యవహారిస్తుందో చెప్పాలని మంత్రి జూపల్లి సభాముఖంగా ప్రశ్నించారు. ఆ తర్వాత టీ వ్యాట్ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభాముఖంగా ప్రకటించారు.
Also read: Modugunta Lake: చెరువును మింగేసిన తిమింగలాలు.. 40 ఎకరాల చెరువు 4 ఎకరాలకే పరిమితమా..?