Harish Rao: నిషేధిత భూముల (22 ఏ) వివాదంపై అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. 22ఏ జాబితాలో ఉంచిన భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం చెప్పలేకపోయారని, కేవలం అబద్ధాలు, అర్ధసత్యాలతో సభను పక్కదోవ పట్టించారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పులను, అవినీతిని తాము సభలో ఎక్కడ బయటపెడతామోననే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించిన భూమిని రాత్రికి రాత్రే 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం, పేదల ఆస్తుల సమస్యలపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం ఘోరమన్నారు.
పోటీ పడి అబద్ధాలు చెప్పడం తప్ప, భూభారతిలో చోటుచేసుకున్న లోపాలపై పొంగులేటి స్పష్టత ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. తమ కుటుంబంపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఎకరా రూ.15 కోట్లు అని ప్రచారం చేస్తున్న ఆ భూమిని రూ.50 లక్షలకే ఇస్తామని, ధైర్యముంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సవాల్ విసిరారు. గత మూడేళ్లుగా లేని తప్పులు ఇప్పుడు ఉన్నట్లు చూపించి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. భూభారతి సీల్డ్ ప్రూఫ్ అని చెబుతున్న మంత్రి, దాదాపు 9,200 డాక్యుమెంట్లు యజమానులకు తెలియకుండానే ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయో సమాధానం చెప్పాలని నిలదీశారు.
నాదర్‌గుల్, వట్టినాగులపల్లి, ఖాజాగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌లలో జరిగిన భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. అసైన్డ్, ఎక్స్‌సర్వీస్‌మెన్ భూముల విషయంలో ప్రభుత్వం తప్పులు చేసిందని, భూభారతి పోర్టల్‌లో రెండు రకాల లోపాలు ఉన్నాయని స్వయంగా మంత్రే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ప్రజలను అయోమయానికి గురిచేయడం మాని, నిషేధిత భూముల జాబితా నుంచి బాధితుల భూములను ఎప్పటిలోగా తొలగిస్తారో ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Also Read: ఒకేసారి ఎక్కువ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? జాగ్రత్త ఈ కాంబినేషన్లు ప్రమాదకరం